ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా నేత సుబ్బయ్య భౌతిక కాయానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఆయన భార్య అపరాజిత, కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాన్ని పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అపరాజిత మాట్లాడుతూ తన భర్తను వైకాపా ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి హతమార్చారని.. వారిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు తకుమ అండగా ఉండాలని లోకేశ్‌ను కోరారు.
ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే, ఆయన బావమరిది, మున్సిపల్ కమిషనర్ల పేర్లను చేర్చాలని ఈ సందర్భంగా లోకేశ్ డిమాండ్ చేశారు. సుబ్బయ్య మృతదేహంతో నేతలు ధర్నాకు దిగారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే సహా ఇతర పేర్లు చేర్చేవరకు ప్రొద్దుటూరు వీడేది లేదని ఈ సందర్భంగా లోకేశ్ తేల్చిచెప్పారు. తెదేపా కార్యకర్తల జోలికి రావాలంటే భయపడేలా చేస్తామన్నారు.
ధర్నా కొనసాగుతుండటంతో లోకేశ్, తెదేపా నేతలతో డీఎస్పీలు ప్రసాదరావు, నాగరాజు చర్చలు జరుపుతున్నారు. ఆందోళన విరమిస్తే పేర్లు చేర్చే విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. ఈ ఆందోళనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, జిల్లా నేతలు లింగారెడ్డి, రెడ్డం వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చుల పుల్లయ్య, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌రెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత సుబ్బయ్య దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది. రాజకీయ కోణంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుబ్బయ్య హత్య వెనుక ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపిస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచదవండి: మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు