తనపై వ్యక్తిగతంగా కొంతకాలంగా జరుగుతున్న మాటల దాడిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తెలుగులో మాట్లాడడంలో లోకేశ్ ఇబ్బంది పడిన సంఘటనలపై వైకాపా నేతలు, సోషల్ మీడియా విభాగం విమర్శలు చేశారు. ఆయనకు ఏమీ తెలియదు అన్న రీతిలో పప్పూ.. అని ట్రోలింగ్ చేశారు. ఎన్నికలకు ముందు నుంచి జరుగుతున్న ఈ తంతంగంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న లోకేశ్.. ఇవాళ మంగళగిరి వేదికగా స్పందించారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీడియో క్లిప్పులను ప్రదర్శించారు. తెలుగు ఉచ్ఛారణలోనూ.. లెక్కలను చెప్పడంలో ముఖ్యమంత్రి చేసిన తప్పులను ఎత్తి చూపారు. తాను చేసిన చిన్న చిన్న పొరపాట్లనే కొన్నాళ్లుగా విపరీతంగా ప్రచారం కల్పించారని.. సీఎం చేసిన వాటికి ఏం చేయాలన్నారు. తాను పప్పు.. అయితే ముఖ్యమంత్రి ఏంటి.. అని నిలదీశారు. తన ఉచ్ఛారణ దోషాల వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద తెదేపా నిరసన