Nara Lokesh : కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యంపై ప్రజా చైతన్య ఉద్యమం చేపడతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. శాసనసభలో మద్యం, కల్తీ నాటుసారాపై ప్రకటనలిచ్చి పారిపోకుండా.. ధైర్యం ఉంటే తమతో చర్చకు రావాలని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. తెలుగు మహిళలు త్వరలోనే బెల్టు షాపులు ధ్వంసం చేస్తారని హెచ్చరించారు.
కృష్ణాజిల్లా ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ అయిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను పరామర్శించిన లోకేష్ అక్కడే బైఠాయించారు. ఎక్సైజ్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామాలను ఎమ్మెల్యేలు లోకేశ్‌కు వివరించారు. నేడు ప్రభుత్వం అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ.. జగన్ మాదిరి రాష్ట్రాన్ని దోచుకోలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలనుకోవడం ఎమ్మెల్యేల తప్పా అని నిలదీశారు. మద్యంపై మాట్లాడితే పరువునష్టం దావా వేస్తామంటూ.. మద్యానికి పరువు అంటగాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు: శాసన సభలో కల్తీ సారా, కల్తీ మద్యంపై చర్చ పెట్టాలని అడిగినందుకు తమ సభ్యులను సస్పెండ్ చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. కేవలం 30 నిమిషాలు మాత్రమే చర్చ పెట్టాలని కోరామన్నారు. తమ సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాతే సీఎం జగన్ సభలో మాట్లాడారన్నారు. అదికూడా అజెండాలో లేని అంశంపై చర్చించారని ఆరోపించారు. సారా నామూనాల్లో రాసాయనాలున్నాయని అసెంబ్లీలో సీఎం ఒప్పుకున్నారని.. ఆ తర్వాత అవి కల్తీ సారా మరణాలు కాదు.. సహజ మరణాలని అనడం దారుణమన్నారు. కల్తీ సారాపై మండలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా వెళదామని.. నమూనాలను ల్యాబ్స్‌కు పంపుదామని.. అందులో రసాయనాలు ఉన్నాయని నిరూపిస్తామని నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి.. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చి ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎన్ని కొత్త బ్రాండ్లు తెస్తారో.. ఎంత మంది ప్రాణాలను బలితీసుకుంటారో తెలియదన్నారు. అధికారంలోకి రాక ముందు రూ.6వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయాన్ని.. ఆ తర్వాత రూ.22వేల కోట్లకు పెంచిన జగన్మోహన్ రెడ్డిని.. జగన్ మోసపు రెడ్డి అనికాక, ఇంకేం అనాలని ప్రశ్నించారు.
త్వరలోనే గుణపాఠం నేర్పిస్తాం: కల్తీ సారా వల్లే 26 మంది చనిపోయారని మృతుల కుటుంబసభ్యులే చెబుతుంటే... అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలని సీఎం జగన్ అనటం దారుణమని నారా లోకేశ్ అన్నారు. బాధిత కుటుంబాలకు తెదేపా తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేశామన్నారు. బాబాయ్ హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు.. ఇప్పుడు సారా మరణాలను సహజ మరణాలంటున్నారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం నేర్పిస్తామని నారాలోకేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: నాటుసారా మరణాలపై జగన్ చెప్పేవన్నీ అసత్యాలే: అచ్చెన్న