ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ... జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నారా లోకేశ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు దొరక్క... మంగళగిరిలో ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారుల కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు. తెదేపా హయాంలో పురపాలక కార్యాలయ పరిధిలోని పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమానికి అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు.
జగన్ ప్రభుత్వం బలవంతంగా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తోందని లోకేశ్ ధ్వజమెత్తారు. తాను విదేశాల్లో చదువుకోవటం కారణంగా... తెలుగులో మాట్లాడటానికి మొదట్లో తడబడిన మాట వాస్తమేనన్నారు. తనలా మరెవరు ఇబ్బందులు పడకూడదని వ్యాఖ్యానించారు. తెలుగు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇంకా ఇసుక సమస్య ఉందని... సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో... స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించేందుకు తెదేపా కృషి చేస్తోందన్నారు. స్వర్ణకారుల కోసం బీమ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దీనిని క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని నారా లోకేశ్ వెల్లడించారు.
ఇవీచూడండి: పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్