Nandamuri Tarakaratna Latest Health News: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత నెల యువగళం పాదయాత్ర ప్రారంభంలో అకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో అతనిని బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటినుంచి అతనికి చికిత్స జరుగుతోంది. అయితే ఇవాళ ఆరోగ్యం విషమించిందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వారికి వివరించారు. దీంతో తారకరత్నను కుటుంబసభ్యులు హైదరాబాద్కు తరలించాలని భావిస్తున్నారు.
అసలేం జరిగింది: గత నెల 27న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఆయన ఆ యాత్రలో కొద్దీ దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కింద పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న యువగళం సిబ్బంది.. కార్యకర్తలు కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత చిత్తూరు పట్టణంలోని పీఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
తర్వాత వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి విషమంగా ఉండడంతో అతనికి కొన్ని రకాలైన చికిత్సలు అందించారు. ముందు మెదడుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. తర్వాత తారకరత్న కొంచెం ఫర్వాలేదని కుటుంబసభ్యులు ప్రకటించారు. మళ్లీ పరిస్థితి విషమించడంతో.. విదేశాలకు తీసుకువెళ్లాలని భావించారు. కానీ ఆ తర్వాత అక్కడి నుంచే వైద్యులను రప్పించి .. హృద్రోగంతో పాటు నాడీ సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స అందించారు.
ప్రస్తుతం వారి పర్యవేక్షణలోనే తారకరత్న ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి బాలకృష్ణ తనతోనే ఉంటూ.. ప్రతిరోజు తారకరత్న పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు. నిత్యం డాక్టర్లతో సంప్రదిస్తూ.. తన యోగక్షేమాలను చూసుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సైతం ప్రత్యేకంగా వాకబు చేస్తున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తారకరత్న ఆరోగ్యం పరిస్థితిపై బెంగళూరు వెళ్లి కనుక్కొంటూ.. వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. అభిమానులు సైతం అతనికి ఏ అపాయం కలుగకూడదని ప్రార్థనలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: