ETV Bharat / state

సీఎంగా ఎన్టీఆర్​ ప్రమాణస్వీకారం చేసి నేటికి 40 వసంతాలు - ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణం స్వీకారం 40 సంవత్సరాలు

40 Years of NTR as AP CM : జన ఘోషను రణఘోషగా మార్చాడు. ఆక్రోశాన్ని ఆవేశంగా మలిచాడు. ప్రజాగ్రహం.. ధర్మాగ్రహమైంది. చక చక చక చైతన్య రథం తెచ్చి .. ఆత్మగౌరవాస్త్రం సంధించాడు. తెలుగు నేలమీద సడి లేని.. నిశ్శబ్ధ రాజకీయ విప్లవం తెచ్చాడు. తొమ్మిది మాసాల తన పార్టీతో.. నూరేళ్ల పార్టీని చాపచుట్టి సుడిగుండంలో పడేశాడు. నవ రాజకీయానికి తెరతీశాడు. నాడు ఆరుకోట్ల ఆంధ్రుల అండతో ఓట్ల సునామీ సృష్టించిన.. నవ చరిత్రకారుడు, చండశాసనుడు, అనితర సాధ్యుడు, అసాధ్యుడు, ఒకే ఒక్కడు.. నటరత్న నందమూరి తారక రామారావు. తెలుగుదేశాధిపతి, చైతన్య రథ విహారి, రాష్ట్ర సారథిగా ప్రమాణం చేసి నేటికి నలభై వసంతాలు.

NTR
NTR
author img

By

Published : Jan 9, 2023, 8:19 AM IST

Updated : Jan 9, 2023, 8:29 AM IST

సీఎంగా ఎన్టీఆర్​ ప్రమాణస్వీకారం చేసి నేటికి 40 వసంతాలు

40 Years of NTR as AP CM : తెలుగు నేల అతడి వెంట నడిచింది. నలువైపులా జనవాహిని పరవళ్లు తొక్కింది. చైతన్య రథ సారథికి చెయ్యెత్తి జేకొట్టింది. గతమెంతో ఘనకీర్తి కల వెండితెర ఆరాధ్యుణ్ణి.. రాజకీయ యవనిక మీద అన్నగారిగా అభిమానించి.. హృదయ పూర్వకంగా స్వాగతించింది. ఎటు వెళితే అటు జన సందోహం.. పోటెత్తి.. 'ఓటెత్తి'. మహా నాయకుడికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. ఈ ధరిత్రి మీద నూరేళ్ల చరిత్ర కలిగిన పార్టీనే.. మట్టి కరిపించిన ఆ చరితార్ధుడు నందమూరి తారకరామారావు. ప్రజాక్షేమం కోసం సాహసాలు చేసిన సంక్షేమ రాముడి.. అలనాటి ప్రజా పట్టాభిషేకానికి నేటికి నలభై ఏళ్లు.

NTR 40 Years : 'నందమూరి తారక రామారావు అను నేను ..'అని.. ఆయన మొట్టమొదట ప్రజా సమక్షంలో చేసిన ప్రమాణాన్ని జగమంతా ఆలకించింది. జనమంతా ఆస్వాదించారు. ఆనాటి అపురూప ఘట్టానికి నేటికి 40 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ పెట్టి ..దుష్పరిపాలనకు కారణాలు కనిపెట్టి.. వాటి పనిపట్టాడు. 97 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్​ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు. సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగిన అపూర్వ సమయం.

వెండితెర అభినవ రాముడు.. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం: 1983 జనవరి 9 పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన తారీఖు. వెండితెరపై ఆరాధ్యుడిగా వెలిగిపోయిన నటరత్న నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టం. ఆయన వెండితెర నుంచి రాజకీయ యవనిక మీదికి మారారు. అక్కడా అగ్ర కథానాయకుడు.. ఇక్కడ రాజకీయ రంగానా అగ్రాధిపత్యమే. మాటలతో మంట పుట్టించి, పదాలు దట్టించి, కాక పుట్టించి, పౌరుషాగ్ని రగిలించి, జనాన్ని అదిలించి, కదిలించి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జనస్మృతి పథం నుంచి ఎలా మాయమవుతాడు. అక్షరాలు చెరిపేస్తే, చరిత్ర చెదిరిపోతుందా? చెరిగిపోతుందా? ఆకర్షణీయ రూపం స్మృతిపథం నుంచి తొలగి పోతుందా?

మహానియంతనే ఓడించిన సింహబలుడు: ఆంధ్రప్రదేశ్​లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ అధిపతిగా జనం మెచ్చిన జనపతి, ప్రబోధాత్మక సినిమాల దళపతి.. ఎన్టీఆర్​ను మర్చిపోవటం తేలికా? అది సంక్షేమానికి రాజముద్ర. అతడు మహానియంతనే ఓడించిన సింహబలుడు. రాజకీయాన్నే మార్చి, సంక్షేమం అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్​గా నిలిచిన మహోన్నతుడు. ఆయన తెచ్చిన సంస్కరణలను విశ్లేషించి.. ఉపదేశించిన తారక మంత్రాన్ని కొత్త తరాల కోసం సమీక్షించుకోవాలి.

దిల్లీకి సలాం కొడుతూ.. మోకరిల్లిన రాష్ట్ర ముఖ్యమంత్రులు: కొన్ని ముద్రలు పడితే కలకాలం ఉంటాయి. వదలించుకోవటం ఒక పట్టాన సాధ్యం కాదు. మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చేసినా.. మద్రాసీలనే అవాంఛిత ముద్ర. తెలుగూ తెల్లారింది. తెలివీ తెల్లారింది. తెలుగు జాతి చేవలేనట్లు పడివుంది. ఇదేమీ పట్టని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, అమాత్యులు దిల్లీకి సలాం కొడుతూ.. మోకరిల్లారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి తులాభారాలు, సత్కారాలు.

ఎవడబ్బ సొమ్ము అని ఎన్టీఆర్​ ఎంట్రీ: ఆయన తర్వాత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య.. ఎయిర్‌ పోర్టులో ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అవమానించినా పట్టింపే లేదు. అవమాన భారాలయినా, తులాభారాలయినా దేనికైనా సిద్ధపడే తత్వం. పదవుల కోసం లాబీయింగ్​లు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు తెల్లవారితే దిల్లీ పయనం. ఐదు నక్షత్రాల హోటళ్లలో బస. అంజయ్య జుంబో జెట్ క్యాబినెట్లో 61 మంది మంత్రులు. రవీంద్ర భారతి, పబ్లిక్ గార్డెన్​కూ ఓ మంత్రి. ఇవి చాలవన్నట్లు కార్పొరేషన్ పదవుల పందేరం. ప్రజాధనం వృథా.. అప్పుడే ఎవడబ్బ సొమ్మని ఖర్చుపెడుతున్నారంటూ ఎన్టీఆర్ నిలదీశారు. నిప్పులు చెరిగారు. జనంలో కట్టలు తెగే ఆగ్రహం.

రాజకీయాల్లోకి అగ్గిరాముడు ప్రవేశం: అధికార పార్టీలో అస్థిరత. ఒకే పార్టీలో ప్రబలిన ముఠాతత్వం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టయ్యింది. రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రులు మారుతున్నారు. ఆ నాలుగేళ్లలో నలుగురు మారారు. పంటలు పండక, అప్పులు తీరక రైతుల ఆత్మహత్యలు, పనులు లేక, జరుగుబాటు లేక కూలీల వలసలు.. యువతకు కొలువుల్లేవు.. విద్యార్ధులు మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలన్నా డొనేషన్ల దోపిడీ ఎక్కువ. పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులుండేవి. వ్యవసాయాలు ఎత్తుబడ్డాయి. వ్యాపారాలు మందగించాయి. ఏ వర్గమూ సంతోషంగా లేదు. సరిగ్గా అప్పుడే తారకరాముడు అగ్గిరాముడిలా వచ్చేశారు. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది.

తెలుగుదేశం పార్టీ స్థాపన: 1982 మార్చి 29 హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. సుముహూర్తం మధ్యాహ్నం రెండున్నర గంటలు. ఎన్టీ రామారావు.. పొలిటికల్ ఎంట్రీ రామారావు. నటరత్న నందమూరి తారక రాముడు.. రాజకీయాల్లోకి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్​లో నిజాం కళాశాలలో బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు.

"హరిజన గిరిజన, దళిత వర్గం, గూడేల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ వుంటే చూచి భరించలేక, వెనుక బడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతుంటే, గుండె బద్దలై, మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను’' అన్న ఎన్టీఆర్ పలుకులు తెలుగు వారి మనసు తాకాయి.

ఎన్టీఆర్​ రాజకీయ సంరంభం.. తెలుగుదేశం పార్టీ ఆరంభం: హైదరాబాద్ న్యూ ఎమ్యెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో నందమూరి తారక రాముని రాజకీయ సంరంభం. తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ఎన్టీ రామారావు ప్రకటించారు. తెలుగుదేశం ఎక్కడి నుంచో ఊడిపడలేదు. ప్రజల మధ్యనే పుట్టింది.

ఈ తెలుగు దేశం శ్రామికుడి చెమటలోంచి పుట్టింది. కార్మికుడి కరిగిన కండలోంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలోంచి పుట్టింది. నిరుపేదల కన్నీటి లోంచి, కష్టజీవుల కంటి మంటల్లోంచి, అన్నార్తుల ఆక్రందనల్లోంచి పుట్టింది ఈ తెలుగుదేశం’. సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా’ భావించి శంఖారావం పూరించారు. బడుగు, బలహీన వర్గాల సాధికారతే ధ్యేయంగా అజెండా తయారైంది. పార్టీ జెండా కూడా రూపు దిద్దుకుంది. 'తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలిరా!' అనే పిలుపే నాటి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఓ మేలుమలుపు అయ్యింది. 1982 మే 27, 28 తేదీల్లో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభలు వైభవంగా నిర్వహించారు.

తనయుడు హరికృష్ణ రథసారథిగా.. చైత్యన రథ యాత్ర: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ దగ్గర ఛవర్లెట్ వాహనం కొనేసి.. ఎన్టీఆర్ ఆ వాహనానికి చైతన్య రథం అని పేరు పెట్టారు. ప్రచారయాత్రకు అనువుగా తీర్చిదిద్దారు. తనయుడు హరికృష్ణ రథసారథిగా తెలుగు నేల నలుదిక్కులా చుట్టేసే యాత్ర ఆరంభమైంది. తొంభై రోజుల పర్యటన అది. 1982 జూన్ 14. తెలుగుదేశం అధిపతి ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రకు బయలుదేరారు.

బెల్ బాటం ప్యాంటు, పొడుగు చేతుల చొక్కా వేసి చైతన్య రథం మీద నిల్చుని '‘నా తెలుగింటి ఆడపడుచులారా, తమ్ముల్లారా.. ' అని ప్రారంభిస్తే జనం నుంచి అపూర్వ స్పందన. దశాబ్ధాల దగాకోరు కాంగ్రెస్ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. పాలకుల నిష్క్రియను, బాధ్యతా రాహిత్యాన్ని చెరిగి పారేశారు. 'చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడా’..'పాట ఎన్టీవోడు వచ్చాడంటూ పెద్దలు, ఇళ్ల నుంచి బయటికి వచ్చి రథం వెంట పరుగులు తీశారు. కేరింతలు కొట్టారు. తారక రాముడిచ్చిన 'ఆంధ్రుల ఆత్మగౌరవం' అనే తారక మంత్రోపదేశం వారికి సులువుగా అర్థమైంది.

తారకరాముడి పిలుపే ప్రజలకు తారకమంత్రం: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని జనం.. తారక రాముడి పిలుపే ప్రభంజనం. ఎన్టీఆర్ సాయంత్రం రావాల్సివుంటే.. వచ్చేసరికి ఏ అర్ధరాత్రో అయ్యేది. అప్పటిదాకా జనం ఓపిగ్గా నిరీక్షించారు. జనాన్ని చూడగానే ఎన్టీఆర్‌ 'నేల ఈనిందా? ఆకాశానికి చిల్లు పడిందా? అంటూ వారిని ఉత్సాహపరిచేవారు. కాంగ్రెస్​ను దుష్టకాంగ్రెస్ అని, దగాకోరు కాంగ్రెస్ అంటూ మాటల దాడి సాగేది. అంతటితో ఆగేదా?' ' కుక్కమూతి పిందెలు' అని ఈసడించారు.

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వాళ్లని దుయ్యబట్టారు. అతిగా తినే వాళ్లకు వాడే.. కుక్షింభరులు లాంటి పదాలు సునాయాసంగా ఆయన నోటి నుంచి వెలువడుతుంటే.. జనం కరతాళ ధ్వనులు చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో 90 రోజుల పాటు ఏకబిగిన పర్యటన సాగింది. 35 వేల 500 కిలోమీటర్లు చుట్టివచ్చారు. నాడిది ఓ రికార్డుగా ప్రపంచం కీర్తించింది.

ఎన్టీఆర్​ పదఘట్టనకు కకాలవికలమైన కాంగ్రెస్​: 1982 అక్టోబర్ 3 నుంచి నవంబర్ 26 దాకా 55 రోజుల పాటు రెండో ప్రచార యాత్ర సాగింది. ఈ యాత్ర 25 వేల కిలోమీటర్లు చుట్టి వచ్చింది. మొత్తం మూడు దఫాలుగా సాగింది చైతన్య రథయాత్ర. ఎన్టీ రామారావు ఇచ్చిన ఆత్మగౌరవ నినాదాం పార్థుని పాశుపతాస్త్రమైంది. మాటలే అక్షరతుణీరాలై, అస్త్ర, శస్త్రాలై దూసుకొచ్చాయి. మూడు దఫాలుగా సాగిన చైతన్యరథ ఘట్టనకు, ఎన్టీఆర్ పద ఘట్టనకు కాంగ్రెస్ కకావికలమై.. తుడిచి పెట్టుకుపోయింది.

ఈ ప్రజాయుద్ధంలో కాంగ్రెస్ అతిరథ మహారథులు ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ 201 సీట్లు గెలిచింది. కాంగ్రెస్​కు 60 సీట్లే వచ్చాయి. జనవరి తొమ్మిదో తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతానికి భిన్నంగా రాజ్​భవన్​లో కాకుండా ప్రజల మధ్య.. క్రీడా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం ఒక విశేషం.

ఇవీ చదవండి: ఆదాయపెంపు మార్గాలపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి.. వచ్చే ఏడాది లక్ష్యం ఎంతంటే?

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. 13న 'ఎంవీ గంగా విలాస్​' ప్రారంభం

Last Updated : Jan 9, 2023, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.