నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, అభ్యుదయవాదుల పోరాటాలతో సీఎం సీటుకెక్కిన కేసీఆర్.. నేడు ఆయా వర్గాలను మోసం చేస్తున్నారని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో.. పట్టభద్రులంతా అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్, కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించినట్లు జయసారథి రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి విసిగిపోయారని వివరించారు. వామపక్ష పార్టీలు, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల యూనియన్ల మద్దతుతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతారనే నమ్మకంతో అన్ని జిల్లాల నాయకులతో చర్చించి జయసారథి రెడ్డికి తాము మద్దతిస్తున్నామని.. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సదానందం తెలిపారు. పట్టభద్రులంతా జయసారథిని గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ భాజపాదే గెలుపు: కిషన్ రెడ్డి