మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం... గతేడాది ఆగస్టు 16న రక్తశుద్ధి కేంద్రాలను ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో... రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్ నగర్ ఆస్పత్రుల్లో... రక్తశుద్ధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఏడాది గడిచిన సందర్భంగా... ఆయా కేంద్రాల్లో అందుతున్న సేవలపై సర్కారు నిర్వహించిన సమీక్షలో నల్గొండకు... మొదటి స్థానం దక్కింది. హుజూర్ నగర్‌కు 4, సూర్యాపేటకు 5, మిర్యాలగూడకు 11వ స్థానం దక్కింది.
12 గంటల పాటు సిబ్బంది సేవలు...
ఉమ్మడి జిల్లాలోని కేంద్రాల్లో ఎక్కడా మూత్రపిండాల వైద్యుడు అందుబాటులో లేకపోయినా... టెక్నీషియన్లే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే... వైద్యం అందించేవారు. 8 గంటలు మాత్రమే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితుల్లోనూ... రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న నల్గొండలో మానవతా దృక్పథంతో 12 గంటల పాటు సిబ్బంది పనిచేస్తున్నారు.
ఆన్లైన్ సలహాలతో...
జిల్లా కేంద్రాసుపత్రిలో నిత్యం... 40 నుంచి 45 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రతి నెల ఈ ఒక్క కేంద్రంలోనే... వెయ్యి మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. అదనంగా మరో 2 వందల మంది... రక్తశుద్ధి కోసం ఎదురుచూస్తుంటారు. రక్తాన్ని శుద్ధి చేసే డయలైజర్‌ను నిజానికి... మూణ్నాలుగు సార్లు వాడుకోవచ్చు. కానీ... ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... రోగి వచ్చిన ప్రతిసారీ కొత్త డయలైజర్‌ను వాడుతున్నారు. ఆన్లైన్లో ఉస్మానియా వైద్యులు ఇచ్చే సూచనలతో... నల్గొండ రక్తశుద్ధి కేంద్రంలోని రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.
సౌకర్యాలు పెంచాలని విజ్ఞప్తి...
రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం, సరిపడా పడకలు లేకపోవడం వల్ల... కొంతమంది హైదరాబాద్ తరలిపోతున్నారు. అధికారులు ఈ సమస్యను గుర్తించి పడకల సంఖ్యతో పాటు సౌకర్యాలను మెరుగు పరిచితే... రోగులకు విలువైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు ఇక్కడి సిబ్బంది.
ఇవీ చూడండి: బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!