రాష్ట్రంలో సామాజిక, ఆర్థికాభివృద్ధిలో నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రతిష్ఠాత్మక పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థికంగా చేయూతనిస్తోంది. వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, సంస్థాగత అభివృద్ధి, గ్రాంట్ల రూపంలో చొరవ ప్రదర్శిస్తూ రుణాలు అందజేస్తూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో భాగస్వామ్యం వహిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం సంబంధించి రైతుల కోసం వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాల కోసం వివిధ బ్యాంకుల ద్వారా రూ.13,915.22 కోట్లు పంపిణీ చేసింది.
పెరిగిన రుణాల పంపిణీ
పలు జిల్లాలో వాటర్‌షెడ్ పథకాలు అమలవుతున్న గ్రామాల్లో లబ్ధిదారుల ఆర్థిక, జీవన ప్రమాణాల పెంపు కోసం రూ.100 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 6,633 కోట్లు విడుదల చేసింది. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.2,394 కోట్లు పంపిణీ చేసింది. ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల సంస్థకు రూ.2500 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల అమలు, చొరవ కింద మొత్తం రూ.20,549 కోట్లు అందజేసింది. 2019-20లో 16,312 కోట్ల నాబార్డ్ రుణాలు పంపిణీ చేశారు. అంటే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రుణాల పంపిణీ 25.09 శాతం పెరిగినట్లు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వైకే రావు ఈటీవీ భారత్‌తో తెలిపారు .
బలోపేతమే లక్ష్యం
గ్రామీణాభివృద్ధికి మరింత ఊతం ఇచ్చే క్రమంలో వ్యవసాయేతర రంగానికి రూ.41.39 కోట్లు పంపిణీ చేసింది. గతేడాది ఈ రంగానికి రూ.33.18 కోట్లు మంజూరు చేసింది. వ్యవసాయ అనుబంధ వాతావరణ మార్పుల ప్రాజెక్టులు, వాటర్‌షెడ్ అభివృద్ధి, వైవిధ్యమైన ప్రాజెక్టులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు - ఎఫ్‌పీవోల కార్యకలాపాలు మరింత విస్తరింపజేందుకు రూ.26 కోట్లు పంపిణీ చేసింది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాలు రెట్టింపు చేసే క్రమంలో ఎఫ్‌పీవోలకు ఆర్థిక సాయం అందిస్తున్న నాబార్డ్ పర్యవేక్షణలో 330 సంఘాలు పనిచేస్తున్నాయి. రాబోయే నాలుగేళ్లల్లో ఈ సంఘాలను బలోపేతం చేయాలన్నది లక్ష్యం.
మహిళల కోసం ప్రత్యేక చొరవ
గత ఏడాది 57 సంఘాలకు లింకేజీ సదుపాయం కల్పించడం ద్వారా నాస్కామ్, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు పంపిణీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 18 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.5.7 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. స్వయం సహాయ బృందాల మహిళల్లో వృత్తి, మార్కెటింగ్, వ్యాపార నైపుణ్యాలు పెంపొందించేందుకు రూ.2 కోట్లు ఖర్చు చేసింది. జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రదర్శనల్లో తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం కోసం రూ.1.40 కోట్లు మంజూరు చేసింది.
బహుళ సేవల దిశగా కృషి
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, సహకార సంఘాలు, ఆర్ఆర్‌బీల సంస్థాగత అభివృద్ధి కోసం రూ.6 కోట్లు కేటాయించింది. క్షేత్రస్థాయిలో బహుళ సేవలు అందించే సంఘాలుగా తీర్చిదిద్దేందుకు 200 పైగా సొసైటీలకు రూ.137 కోట్లు పంపిణీ చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నాబార్డ్... అగ్రిబిజినెస్, ఇంకుబేషన్ సెంటర్ల నిర్వహణ కోసం నార్మ్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.14 కోట్లు విడుదల చేసింది.
ఇదీ చదవండి: 'టీకా ఉత్సవ్'పై అవగాహన తీసుకురావాలి: కిషన్ రెడ్డి