NAARM trains young scientists : ఒక దేశ సంపద నదులు కాదు, సముద్రాలు కాదు.. ఖనిజాలు కాదు. కలల ఖనిజాలతో ఉన్న యువత అనే మాటలు.. ఈ యువ శాస్త్రవేత్తలకు సరిగ్గా సరిపోతాయి. దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అందుకోసం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో 3 నెలల ఫౌండేషన్ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
దేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలకు నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ - (నార్మ్) చిరునామాగా మారింది. హైదరాబాద్ వేదికగా రాజేంద్రనగర్‌లో ఉన్న ఈ సంస్థ... వివిధ హాదాల్లో పనిచేస్తున్న వారికి శిక్షణ ఇస్తూ వ్యవసాయాభివృద్ధి కోసం బాటలు వేస్తోంది. ఇప్పటి వరకు 7000 మంది పైగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చింది. తాము పొందిన శిక్షణ రైతులకు ఎలా ఉపయోగపడుతుందో చెబుతున్నారీ శాస్త్రవేత్తలు.
తాజాగా నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో యువ శాస్త్రవేత్తల శిక్షణ 112వ ఫోకార్స్ విజయవంతంగా ముగిసింది. రైతులు అనేక క్లిష్టపరిస్థితులు ఎదుర్కుంటున్న దృష్ట్యా.. తమ పరిశోధనలకు పదునుపెడుతూ సేద్యాన్ని లాభసాటిగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తామంటున్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహార భద్రత, పోషకాహార భద్రత ఓ సవాల్‌గా మారుతోంది.
ఈ సమయంలో వ్యవసాయానుబంధ పాడి, ఉద్యాన, మత్స్య, పట్టు, కోళ్లు, మాంసం, సేంద్రియ పరిశ్రమలకు సంబంధించిన సబ్జెక్టుల్లో తర్ఫీదు పొందడంతోపాటు తమ నైపుణ్యాలు అద్భుతంగా ప్రదర్శించారు. మంచి ప్యాకేజీలు పొందే అవకాశమున్నా.. వీరు రైతుల అభివృద్ధే లక్ష్యం అంటున్నారు. ఈ శిక్షణ ద్వారా కచ్చితంగా రైతుల సాగు విధానంతో పాటు వారి జీవితాల్లోనూ మంచి ఆర్థిక తోడ్పాటు అందిస్తామని చెబుతున్నారు. శిక్షణ పొందిన వారిలో 42 మంది మహిళా శాస్త్రవేత్తలు ఉండటం విశేషం.
మూడు నెలలుగా శిక్షణ తీసుకున్న వీరు కచ్చితంగా తమ లక్ష్యాలను చేరుకోగలరని శిక్షణ సంస్థ డైరెక్టర్ చెబుతున్నాడు. బీటీ పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తి, పశు, మత్స్య సంపద పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యేకించి 30 శాతం వృథా అరికట్టడంపై సంస్థ వీరికి శిక్షణ ఇచ్చింది. రైతులు వ్యవసాయం చేస్తూ సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా వీరి ప్రణాళికలు ఉండనున్నాయి. భారత వ్యవసాయ రంగంలో విధానాలు, సంక్షేమ పథకాల రూపకల్పన కోసం నార్మ్ సంస్థను థింక్ ట్యాంకుగా మోదీ సర్కారు ప్రకటించడం ప్రాధాన్యత గల అంశం. ఈ నేపథ్యంలోనే జులై 18వ తేదీన 113వ ఫౌండేషన్ కోర్సు శిక్షణ ప్రారంభం కానుంది.
"పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహార భద్రత, పోషకాహార భద్రత ఓ సవాల్‌గా మారుతోంది. వీరు వచ్చే 40 సంవత్సరాల పాటు వ్యవసాయరంగంలో సేవలు అందించనున్నారు. రైతులు అనేక క్లిష్టపరిస్థితులు ఎదుర్కుంటున్న దృష్ట్యా.. తమ పరిశోధనలకు పదునుపెడుతూ సేద్యాన్ని లాభసాటిగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తారు". - చెరుకుమల్లి శ్రీనివాసరావు, నార్మ్ డైరెక్టర్
ఇవీ చదవండి: