ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని బోలక్ పూర్, ముషీరాబాద్, కవాడిగూడ డీపీఆర్బీఎల్, దోమలగూడలోని గగన్ మహన్, రంగానగర్లోని బైబిల్ హౌస్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేత రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా పరీక్షల కోసమే కాకుండా వ్యాక్సిన్ కోసం కూడా ఎక్కువ మంది రావడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. కూర్చోవడానికి స్థలం లేక ఎండలో గంటల తరబడి నిలబడే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌ఛైర్ సౌకర్యం లేకపోవడం బాధాకరమని చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలకు, వ్యాక్సిన్ కోసం వచ్చే ప్రజలకు కనీసం శానిటైజర్ కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు.
కొవాగ్జిన్ కోసం పడిగాపులు...
కోవాగ్జిన్ రెండో డోస్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్ నగర్ వాస్తవ్యుడు, జీహెచ్ఎంసీ ఉద్యోగి కామాటి సురేందర్ రెండో డోసు కోసం గత 20 రోజులుగా ఫీవర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఏ ఒక్క ఆస్పత్రిలోనూ అతడికి టీకా ఇవ్వలేరు. మార్చి 12వ తేదీన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉన్నత అధికారుల ఒత్తిడి మేరకు కొవాగ్జిన్ టీకా మొదటి డోసు వేయించుకున్నాని రెండో డోసు కోసం దాదాపు 20 రోజులుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని సురేందర్ ఆరోపించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా