రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 24 నుంచి కార్యక్రమం ప్రారంభించి పది రోజులపాటు కొనసాగించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో పట్టణ ప్రగతిపై మంత్రులకు అవగాహన కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజాప్రతినిధులు, అధికారులకు పూర్తిస్థాయిలో మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు నిర్వహించనున్నారు. శాసనసభ్యులు, నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంస్థల ఛైర్ పర్సన్లు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సదస్సుకు హాజరుకానున్నారు.
పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలి
పట్టణప్రగతికి సన్నాహకంగా జరగనున్న సదస్సులో కార్యక్రమ నిర్వహణపై చర్చిస్తారు. నిధులను సద్వినియోగం చేసుకుని పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా పట్టణాలను అభివృద్ధి చేసే విధానాలపై సమాలోచనలు జరుపుతారు. విధివిధానాలను ఖరారు చేయడంతో కార్యాచరణను ఖరారు చేస్తారు. పట్టణప్రగతికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలు, తన ప్రణాళికలు, ఆలోచనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
గజ్వేల్లో పర్యటించనున్న కలెక్టర్లు
అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పర్యటనకు వెళ్లనున్నారు. గజ్వేల్లో నిర్మించిన శాకాహార, మాంసాహార మార్కెట్లు, శ్మశానవాటికలను పరిశీలిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోనూ అవసరానికి తగ్గట్లుగా శాకాహార, మాంసాహార మార్కెట్లను నిర్మించాలని.. అన్ని చోట్లా శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారుల పర్యటన నేపథ్యంలో గజ్వేల్లో ఏర్పాట్లు చేశారు.
అన్ని జిల్లాల్లో పురపాలక సదస్సులు
పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నాహకంగా అన్ని జిల్లాల్లోనూ పురపాలక సదస్సులు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సదస్సులను నిర్వహించి పట్టణప్రగతి అమలుపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకేరోజు సమ్మేళనాలు నిర్వహించే అవకాశం ఉంది. మంత్రులు, ఇతర ముఖ్యులు పురపాలక సమ్మేళనాలకు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.
ఇవీ చూడండి: దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్