మూడేళ్ల క్రితం జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ ఘన విజయం సాధించి కొన్నింటిని మినహాయిస్తే అన్ని నగరాల మేయర్లు, పట్టణాల ఛైర్‌పర్సన్ల పదవులను దక్కించుకుంది. ఈ పదవుల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉండేది. ఏదో రకంగా సర్దుబాటు చేసి అప్పటికి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టం ప్రకారం ప్రస్తుతం మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికైన 3 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉండటం, ఇతర ఇతర కారణాలతో అవిశ్వాసానికి అవకాశం ఉంటుందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త పడింది.
కాలపరిమితి బిల్లుపై గవర్నర్ ఆమోదం ఎప్పుడో?: అసలే 2023 శాసనసభ ఎన్నికల ఏడాది కావడంతో అవిశ్వాసాలు తలనొప్పిగా మారతాయని భావించి పురపాలక చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. మేయర్, ఛైర్‌పర్సన్‌లపై అవిశ్వాసానికి కాలపరిమితిని 3 నుంచి నాలుగేళ్లకు పెంచుతూ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఉభయ సభల ఆమోదం కూడా లభించింది. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ బిల్లు చట్ట రూపం కాకపోవడంతో సమస్య ఏర్పడింది. శాసనసభ, మండలి ఆమోదించిన పురపాలక చట్ట సవరణ బిల్లు సహా ఇతర బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపలేదు. దీంతో అవిశ్వాస కాలపరిమితి ఇప్పటికీ మూడేళ్లుగానే ఉంది.
అవిశ్వాసం దిశగా బీఆర్‌ఎస్ నేతల అడుగులు: మూడేళ్ల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టొచ్చన్న అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల వేళ ఛైర్‌పర్సన్ పదవులు దక్కకపోవటంతో పార్టీ నేతలు, ఎమ్మెల్యేల బుజ్జగింపులతో కొందరు, మూడేళ్ల తర్వాత ఛైర్మన్ పదవి ఇస్తామన్న హామీలతో ఆశావహులు అప్పట్లో వెనక్కి తగ్గారు. మూడేళ్ల కాలపరిమితి 27తో ముగియడంతో అసంతృప్తులు ఒక్కొక్కరుగా అవిశ్వాసాల గళమెత్తుతున్నారు.
కొన్ని జిల్లాలో అవిశ్వాసం కోసం నోటీస్‌లు జారీ: ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మేయర్, రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, వికారాబాద్ జిల్లా తాండూర్ వికారాబాద్ తదితర పట్టణాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లపై అవిశ్వాసం కోసం కౌన్సిలర్లు నోటీస్ ఇచ్చారు.
మేడ్చల్ జిల్లాలో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్య సహా 28 మంది కార్పొరేటర్లుండగా.. మేయర్ తీరుపై డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో 20 మంది కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెప్పిన పనులనే చేస్తున్నారని, సొంత డివిజన్‌లో కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించారని ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం వీరంతా బస్సులో శిబిరానికి తరలివెళ్లగా.. నిన్న న్యాయవాది ద్వారా అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. అసమ్మతి కార్పొరేటర్లను బుజ్జగించేందుకు మంత్రి యత్నించినా వారు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో: ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోవడం లేదంటూ రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో అసమ్మతి ఛైర్‌పర్సన్ చెవుల స్వప్నాచిరంజీవి, వైస్ ఛైర్‌పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్‌రెడ్డిలపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా.. వీరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు. పురపాలికలో కీలకమైన అభివృద్ధి పనులు సాగకుండా ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌లు అడ్డుకుంటున్నారని.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సూచనలనూ ఛైర్‌పర్సన్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఇబ్రహీంపట్నంలో: అలాగే ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ కప్పరి స్రవంతిపై అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఈ పురపాలక సంఘంలో మొత్తం 24 మంది కౌన్సిలర్లుండగా.. 21 మంది అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఛైర్‌పర్సన్ స్రవంతిపై అవినీతి ఆరోపణలున్నాయని, పురపాలక సంఘం వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం చేసుకుంటున్నారని వైస్‌ఛైర్మన్ ఆకుల యాదగిరి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో: వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ స్వప్నపై అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వైస్‌ఛైర్‌పర్సన్ పట్లోళ్ల దీప, ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి మొత్తం 24 మంది కలెక్టర్ నిఖిలకు శనివారం అవిశ్వాస తీర్మాన ప్రతిని అందజేశారు. ఈ మున్సిపాలిటీలో ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్వప్న, దీపలు రెండున్నరేళ్ల చొప్పున పదవిలో కొనసాగాలి. ఈ గడువు గత ఏడాది జులై 27తో ముగిసినా పదవి నుంచి వైదొలగేందుకు స్వప్న ససేమిరా అన్నారు. దీంతో అధ్యక్షురాలు ఎమ్మల్సీ మహేందర్‌రెడ్డి వర్గంగా, ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వర్గంగా విడిపోయారు.
అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతుండగా.. తాజాగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. వికారాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ మంజుల, వైస్‌ఛైర్‌పర్సన్ శంషాద్ బేగంలపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ప్రతిని భారాస కౌన్సిలర్లు కలెక్టర్‌కు అందజేశారు. మాజీ ఛైర్‌పర్సన్, ప్రస్తుత కౌన్సిలర్ ఆధ్వర్యంలో 20 మంది వార్డు కౌన్సిలర్ల సంతకాలతో ప్రతిపాదించారు.
ఇవే కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని పురపాలికల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. అవిశ్వాసంబాట పట్టిన వారిని బుజ్జగించడం, సర్దుబాటు చేయడం కత్తిమీద సాముగా మారింది.
ఇవీ చదవండి: