ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలకు నిరసనగా యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష ముగిసింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గాంధీభవన్‌లో రెండు రోజుల దీక్షకు దిగారు. గురువారం ఉదయం ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద... అనిల్, వెంకట్ మెడలో పూలమాలలు వేసి దీక్ష ప్రారంభింపజేశారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్ సంఘీభావం ప్రకటించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి... ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ, మాజీ మంత్రి పురుషోత్తమ్‌రావు... నిమ్మరసం ఇచ్చి అనిల్, వెంకట్ దీక్షను విరమింపజేశారు.