పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ వారికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు ఈటల, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు కేశవరావు, బండ ప్రకాష్‌లు శంకుస్థాపన చేశారు.
విద్య ద్వారానే..
తెరాస ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలను... భాజపా పాలిత రాష్ట్రాల్లో తీసుకున్నామని చెప్పగలరా అని మంత్రి ఈటల రాజేందర్ సవాల్ చేశారు. ఏది పడితే అది మాట్లాడి తెలంగాణను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సందర్భం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. విద్య ద్వారానే ప్రజల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఈటల తెలిపారు.
బాధ్యతగా తీసుకుంటాం
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అన్ని కులాల వారు ఆత్మగౌరవంతో జీవించాలనే సీఎం కేసీఆర్ ఈ భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి మత్స్యకారులుగా.. ఎన్‌రోల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని తలసాని వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో భవనాలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి బాధ్యతగా తీసుకుంటానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ప్రజలు ప్రభుత్వానికి వెన్నంటే ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రులు వెల్లడించారు. పేదల బతుకులు బాగుపడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి : చట్టాల సంగతేమో కానీ.. కేసీఆర్ మాత్రం మారారు: భట్టి