కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన ఖైదీలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలాఖరు వరకు లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం... పలు జైళ్లలో వేలాది ఖైదీలు ఒకేచోట ఉంటున్న విషయాన్ని విస్మరించిందన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో దాదాపు రెండు వేల మంది ఖైదీలు, రెండు వందల మంది జైలు సిబ్బంది ఉన్నారని గుర్తు చేశారు.
సీఎందే బాధ్యత...
ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలంతా ఒకే ప్రాంగణంలో ఉండటం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత సీఎందే అన్నారు. అమెరికా, ఐర్లాండ్, యూకే, ఇరాన్ దేశాలు... జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను సంప్రదించి, ఖైదీలను బెయిల్పై విడుదల చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంతో జరగరాని ఘటన జరిగితే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.