గాంధీ ఆస్పత్రి సందర్శనకు వెళ్లుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల జీతాలు రెట్టింపు చేయాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా సేవలో ఉన్న వీరికి ఇప్పుడిస్తున్న రూ.8 వేల జీతాన్ని రూ.16 వేలకు పెంచాలని కోరుతూ ముఖ్యమత్రి కార్యాలయానికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ప్రోత్సాహకాలను ఇంత వరకు ఇవ్వలేదని... అవి ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రి వేదికగా జూడాలతో చర్చలు జరిపి అక్కడిక్కడే సమస్యలు పరిష్కరించాలని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్దేశిత గడువు విధించుకుని... ఆ లోపు పరిష్కారం చూపాలని కోరారు. కొవిడ్‌తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అర చేతిలో వైకుంఠం చూపించారని... ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ్టి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటనలా కాకూడదని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు