పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు 2005లోనే ఆదేశాలు వచ్చాయని ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఆనాడు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రక్రియ ఆలస్యం అవుతోందని కేసీఆర్ రాజీనామా చేశారని... ఆ తర్వాత పోతిరెడ్డిపాడుపై ప్రస్తావన కూడా తేలేదని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నష్టం కలగనుందని చెప్పారు. నాలుగు జిల్లాలు ఎడారిగా మారేందుకు ఏపీ జీవో కారణం అవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో జగన్ భేటీ తర్వాతే ఏపీ జీవో ఇచ్చిందని ఆరోపించారు.
గతంలో పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ పోరాటానికి సంబంధించి ఆధారాలు చూపాలని అన్నారు. ఆధారాలు చూపితే ఆయన విధించే ప్రతి శిక్షకు సిద్ధంగా ఉన్నానని... సవాల్ విసిరారు. ఏపీ జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కదలాల్సి ఉందని వెల్లడించారు. ఇది కేసీఆర్, జగన్ సొంత వ్యవహారం కాదు.. ప్రజల సమస్య అని వాఖ్యానించారు. కృష్ణా జలాలు రోజూ ఏపీకి తరలిస్తే శ్రీశైలం ఎండిపోతుందని చెప్పారు. ఆఖరి బొట్టు వరకు ఏపీ తరలించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక పోరాటంగా మారుస్తుందని ప్రకటించారు. భవిష్యత్తులో క్షేత్రస్థాయిలోనూ.. న్యాయపరంగా పోరాడుతామన్నారు. ప్రజల ఆకాంక్షలు, హక్కులు కాపాడేందుకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'