దేశం కోసం పని చేస్తున్న సైనికులు కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు "భారత్ కే వీర్'' నిధుల నుంచి అదనంగా మరో రూ.15లక్షలు ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ... రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దేశం కోసం పని చేస్తున్న సైనికుల కోసం అందరం అండగా ఉంటామని ప్రకటించారు.
సెంట్రల్ ఆర్మడ్ పోలీసు ఫోర్సెస్ 25,418 పాజిటివ్ కేసులు రావడం, వంద మంది చనిపోయినట్లు తెలుసుకుని తనకు బాధకలిగించిందన్నారు.
ఇండియన్ ఆర్మీలో 16,728, నావీలో 1365, ఎయిర్ ఫోర్స్‌లో 1716 మందికి కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదై 35 మంది మృతి చెందారని తెలిసి తనకు బాధ కలిగించిందని తెలిపారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది కరోనాతో మరణిస్తే... వారి కుటుంబాలకు సాధారణ ప్రయోజనాలతోపాటు రూ.15 లక్షలు అదనంగా “భారత్ కే వీర్”ఫండ్స్ నుంచి ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మన రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికులతో సహా ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ కనీసం రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'అమూల్ బేబీ' ఎలా పుట్టిందో తెలుసా?