Kottha prabhakar Reddy: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల పట్ల చూపుతున్న వివక్ష, సవతితల్లి ప్రేమకు ముగింపు పలకాలని మెదక్ ఎంపీ, తెరాస లోక్‌సభ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు వచ్చే ఆదాయంలో 60 శాతం తెలంగాణ నుంచే ఉంటోందని, అందులోనూ 80 శాతం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే వస్తున్నందున అక్కడి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మంగళవారం లోక్‌సభలో రైల్వేశాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన తెరాస తరఫున మాట్లాడారు. ‘‘తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రి, రైల్వేశాఖ మంత్రులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త లైన్లు, రైల్వే డివిజన్లు, రైళ్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై, హైదరాబాద్‌కు బుల్లెట్ రైలుపై ప్రకటనలు లేవు. చర్లపల్లి స్టేషన్ శాటిలైట్ టర్మినల్స్ అభివృద్ధిని వేగవంతం చేయాలి. సికింద్రాబాద్‌లో ఉన్న రైల్వే డిగ్రీ కాలేజీని యూనివర్సిటీగా మార్చాలి’’ అని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కంటోన్మెంట్ భూముల లీజు విధానాన్ని పునఃసమీక్షించి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించే పద్ధతిని తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన లోక్‌సభ ముందుంచారు.
రూ.12,372 కోట్ల రుణం అడిగిన కాళేశ్వరం కార్పొరేషన్
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ తెలంగాణలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టు పనుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ)ని రూ.12,372 కోట్ల రుణం అడిగిందని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో భాజపా ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఎలెక్ట్రో, హైడ్రో మెకానికల్, ఇతర సివిల్ పనుల కోసం రూ.8,927.27 కోట్లు, 22 ఎత్తిపోతల పథకాల కోసం రూ.3,444.97 కోట్ల రుణం ఇవ్వాలని ఆ సంస్థ అడిగినట్లు వివరించారు.
ఇదీ చూడండి: