నల్గొండ జిల్లా ప్రాజెక్టుల నిలిపివేతపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ తన నియంతృత్వ పోకడలతో ఎడారిగా మారుస్తున్నారని ఆరోపించారు.
శ్రీశైలం సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అవి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల కోరికని.. వాటిని ఎందుకు ఎడారిగా మారుస్తున్నారని ప్రశ్నించారు. 1981లో టంగుటూరి అంజయ్య ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయగా.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు జరగలేదని పేర్కొన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ దగ్గరుండి శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలైనా అర కిలోమీటరు మేర కూడా పనులు జరగలేదని.. అసలు పనులు చెయ్యదల్చుకున్నారా? లేదా? సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 75 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వానికి అప్పగిస్తే ఆరేళ్ల కాలంలో ఏం చేశారని సీఎంను నిలదీశారు. కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. పనులను నిలిపివేశారని ఆరోపించారు. లక్ష ఎకరాలకు సాగునీరందించే బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి కేవలం రూ.100 కోట్లు కేటాయిస్తే పూర్తవుతుందని పేర్కొన్నారు. నల్గొండ, చిట్యాల, కట్టంగూర్, శాలిగౌరారం, నార్కట్‌పల్లి మండలాల్లో పలు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: 'నమామి గంగే.. తరహాలో మూసీ నది ప్రక్షాళన చేపట్టండి'