టీపీసీసీ పదవిపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో పీసీసీ చాలా చిన్న పదవని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురించి తన వద్ద మాట్లాడొద్దన్న కోమటిరెడ్డి.. రేవంత్‌రెడ్డి చిన్న పిల్లవాడన్నారు.
రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పానని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు పీసీసీ పదవి రాకపోయినప్పటికీ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థవంతమైన నేత లేడన్న ఆయన.. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతానని తెలిపారు.
కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరు. రేవంత్ చిన్నపిల్లవాడు. ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పా. నేతలు రాజకీయాలు వదిలేసి.. అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజాసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతాను.-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ
అంతకుముందు భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంత్రి కిషన్ రెడ్డిని కోమటిరెడ్డి కలిశారు. కేబినేట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదగా భావించి.. భువనగిరి ఖిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: MP KOMATI REDDY: 'రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను'