MP arvind comments on turmeric board నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై అర్వింద్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న అన్ని పథకాలు ఉంటాయని.. మరిన్ని అదనంగా తెస్తామని ప్రకటించారు. ఫించన్లు సహా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని పథకాలు బీజేపీ హయాంలోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కుక్కల బెడదతో పాటు బీఆర్ఎస్ నేతల బెడద సైతం అలాగే ఉందని విమర్శించారు. భూకబ్జాలు, కమీషన్‌లతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిర్వహణకు సైతం నిధులు లేక శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు నిర్వహణ లేదన్నారు. ప్రాజెక్టులకు ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోయే అవసరం లేదని అర్వింద్ చెప్పారు. రెండు పడక గదుల ఇళ్లు రాష్ట్రంలో నిర్వీర్యమైపోతున్నాయని.. కట్టిన ఇళ్లు తక్కువ కావడంతో ఎవరికి పంచాలో అర్థం కాక అలాగే వదిలేశారన్నారు.
పసుపు పంటకు ఎంఐఎస్ పథకం అమలు చేస్తామని టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పెట్టిందని.. రాష్ట్రం తన వాటా నిధులు ఇస్తామని లేఖ రాస్తే రైతులకు ధర తగ్గినప్పుడు ఆ లోటు భరిస్తామని పార్లమెంట్‌లోనే కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు.
''పసుపు బోర్డు, సుగంధ ద్రవ్యాల బోర్డుకు పెద్దగా తేడా లేదు. సుగంధ ద్రవ్యాల బోర్డు వేగంగా పనిచేస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే పొలం నుంచే నేరుగా సరకు విక్రయం. మౌలిక సౌకర్యాల కోసం వడ్డీ లేని రుణాలను కేంద్రం ఇస్తోంది. ఐదేళ్లలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.4,418కోట్లు ఇచ్చింది. రైల్వేస్టేషన్లను అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. బీజేపీ వస్తే పింఛను, పథకాలు ఆగిపోతాయని దుష్ప్రచారం జరుగుతోంది. బీజేపీ వస్తే రాష్ట్రంలోని అన్ని పథకాలు కొనసాగుతాయి.'' - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
ఇవీ చదవండి: