ఆస్తి కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తూ... ఇంట్లోంచి వెళ్లగొట్టిన కొడుకు, కోడలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ ఓ తల్లి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. తనకు కుమారుడు లక్ష్మీనరసింహ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని... తన భర్త అర్జున్ 2009లో అనారోగ్యంతో కన్నుముశారని మెదక్ పట్టణం ఇందిరాకాలనీకి చెందిన మోహరీయ ప్రవీణ కమిషన్కు వివరించింది. భర్త చనిపోయిన కొద్ది రోజులకే కొడుకు లక్ష్మీనరసింహ, కోడలు శైలజలు ఆస్తి కోసం అన్నం పెట్టకుండా తీవ్రంగా కొట్టి, బయటకు వెళ్లగొట్టారని బాధిత తల్లి వాపోయింది.
అప్పటి నుంచి తాను హైదరాబాద్లోని తన చిన్న కుమార్తె ఇంట్లో ఉంటున్నానని పేర్కొంది. ఇదే అవకాశంగా భావించిన కొడుకు, కోడలు తన భర్త చెమటోడ్చి కట్టిన ఇంటిని, పొలాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. తన పింఛను పుస్తకాన్ని కూడా ఇవ్వలేదని... మెదక్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు తనకు పింఛను పుస్తకాన్ని ఇప్పించారని చెప్పింది. తనకు న్యాయం చేయాలని... కొడుకు, కోడలు నుంచి రక్షణ కల్పించాలని కమిషన్ను వేడుకుంది.
ఇవీ చూడండి: గాంధీ ఆసుపత్రిలో కరోనాతో నిండు గర్భిణి మృతి