బల్దియా బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది యువ ఓటర్లే. నగర జనాభాలో దాదాపు 15 లక్షల మంది యువ ఓటర్లున్నారు. వారంతా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటే ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుంది. కానీ యువ ఓటర్ల తీర్పు మాత్రం మరో రకంగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొనే యువత... బ్యాలెట్ బాక్స్ వరకు రాలేకపోతుంది. అర్హత ఉండి కూడా దూరంగా ఉంటోంది. ఫలితంగా నగరంలో యువ ఓటర్ల పోలింగ్ శాతం ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారుతోంది. ఈ విషయంపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం....నిరంతరం ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటోంది. హక్కుగా తీసుకునే ఓటరు గుర్తింపు కార్డును.... బాధ్యతగా ఓటుగా మలుచుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా..
ఓటు హక్కు.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఒక్క క్షణం ఆలోచించి వేసే ఓటు దేశ భవిష్యత్‌ను, ప్రజల మనుగడను నిర్ణయిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. అంతటి గొప్ప ఆయుధాన్ని విస్మరిస్తోంది నేటి యువతరం. దేశంలోనే కాదు... మెట్రో నగరాల్లో చాలా వరకు విద్యావంతులు, యువతీ యువకులు ఓటింగ్‌కు దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోతున్నారు. ఇందుకు అవగాహన లేకపోవడం, ఉదాసీనతే కారణాలుగా భావిస్తున్న ఎన్నికల సంఘం... ఓటరు నమోదు పేరుతో విస్తృత ప్రచారం చేస్తున్నా ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం పెంచలేకపోతోంది.
50 శాతం దాటడం లేదు..
నగరంలో 50 శాతం పోలింగ్ దాటడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 74 లక్షల 4 వేల మంది ఓటర్లున్న గ్రేటర్లో 20 నుంచి 29 ఏళ్ల వయస్సున్న ఓటర్లు సుమారు 15 లక్షల మంది ఉంటారు. వీరిలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నగరంలో నమోదయ్యే ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా అంచనాలు తారుమారై సరైన అభ్యర్థి గెలవడం లేదు. ఈ విషయంలో ఎన్నికల సంఘం యువతను పోలింగ్ కేంద్రం వైపు రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఓటు హక్కుపై అవగాహన సదస్సులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంటోంది.
ఓటు వేయకుండా..
అయితే ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా ఓటింగ్ శాతం పెంపులో యువత భాగస్వామ్యం కాలేకపోతుంది. ఇందుకు కారణాలు అనేకమంటున్నారు నగరంలోని పలువురు యువతీ యువకులు. పోలింగ్ రోజును సెలవు రోజుగా భావించే వాళ్లే ఎక్కువగా ఉంటున్నారని అభిప్రాయపడుతున్నారు. ఒక్క ఓటుతో ఒరిగేది ఏమీ లేదనే అపోహతో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. కానీ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఓటు వేయకుండా సామాజిక మాద్యమాల్లో పాలకులను నిందించడం సరైన విధానం కాదంటున్నారు. ఓటు హక్కుపై అపోహలను వీడి సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, యువత అంచనాలను నీరుగార్చడం వల్లే ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుందంటున్నారు మరికొంతమంది యువతీ యువకులు. ఓటు హక్కు వినియోగంలో మార్పులు అవసరమంటోన్న యువత.... ఎక్కడున్నా ఓటు వేసే విధంగా వ్యవస్థను మలచాలని కోరుతోంది. అంతేకాకుండా అర్హత, అవకాశాలున్నా కూడా ఓటు వేయని వారికి శిక్షలు విధించేలా మార్పులు తేవాలని అభిప్రాయపడుతున్నారు. అప్పుడే ప్రజాస్వామ్యంలో ఓటుకు సరైన న్యాయం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఎన్నికకు ఎన్నికకు మధ్య యువతలో ఎంతో మార్పు వస్తుందని, ఈ సారి గ్రేటర్లో ఓటింగ్ శాతం పెరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు