లాక్‌డౌన్ సడలింపుల అనంతరం తెలంగాణలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఉద్ధృతంగా పెరుగుతోంది. రాష్ట్రంలో తొలి కేసు మార్చి 2న నమోదు కాగా, అప్పట్నుంచి మూడోదశ లాక్‌డౌన్(మే 17) ముగిసే వరకు కరోనాతో 34 మంది చనిపోగా, తర్వాత మే 18 నుంచి జూన్ 21 వరకూ దాదాపు ఐదింతలు(176) అధికంగా కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. వీరిలో 41-60 ఏళ్ల మధ్య ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్లు గణాంకాలను బట్టి అర్థమవుతోంది.
ఇప్పటివరకూ చోటుచేసుకున్న మరణాల్లో 41-60 మధ్య వయసు ఉన్నవారు 47.47 శాతం మంది మృత్యువాత పడగా.. 61 ఏళ్ల పైబడిన వారిలోనూ 40.90 శాతం మంది చనిపోయారు. మొత్తం కొవిడ్ మరణాల్లో అధిక రక్తపోటు, మధుమేహం.. ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దాదాపు 38 శాతం మంది ఉన్నారు. అధిక రక్తపోటు ఉన్న కొవిడ్ మృతులు 12 శాతం, మధుమేహం, గుండెజబ్బులు కలిసి ఉన్న దీర్ఘకాలిక రోగులు మరో 12 శాతం మంది ఉండటం గమనార్హం. ఈ మరణాల్లో జూన్ 1 నుంచి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత చోటుచేసుకున్నవి అత్యధికంగా 128 ఉన్నాయి. కరోనాను కట్టడి చేయడం ద్వారానే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: చైనా సైన్యంపై గెలుపు సులువే- ఇవే కారణాలు..