Money Distribution in Telangana Elections 2023 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రలోభాలపర్వం మొదలైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ తేదీకి వారం రోజుల ముందే నోట్ల పంపిణీ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నారని సమాచారం. వాటితో పాటు మద్యం, మాంసం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కొన్నిచోట్ల పోస్టల్ ఓట్ల(Postal Votes)నూ అభ్యర్థులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీ పోలింగ్ జరగనుంది.
Telangana Assembly Elections 2023 : గతంలో అయితే పోలింగ్ తేదీకి ఒకట్రెండు రోజుల ముందు ఓటర్లకు పార్టీల నేతలు డబ్బులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేసేవారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ప్రచారం ముగియడానికి 28వ తేదీ సాయంత్రం వరకు సమయం ఉంది. రాజకీయ పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు సభలు, ర్యాలీలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నోట్ల పంపిణీ మొదలుపెట్టారు. చివరి రెండ్రోజుల్లో పరిస్థితులు అనుకూలిస్తాయో లేదోనన్న సందేహంతో కొందరు అభ్యర్థులు వారం రోజుల ముందు నుంచే ప్రలోభాలకు తెరతీశారు. తీవ్రమైన పోటీ, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో పంపిణీలు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు
Political Leader Distributes Liquor and Money : హైదరాబాద్ నగరంలో కొంత భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పోస్టల్ ఓట్లకు నగదుతో పాటు మద్యం సీసాలు ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. ఓ ప్రధాన పార్టీ ఓటుకు రూ.3 వేలతో పాటు ఫుల్ బాటిల్ ఇవ్వగా.. మరో ముఖ్య పార్టీ రూ.2 వేలతో పాటు మద్యం సీసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటేసేందుకు అప్పటికే బారులు తీరినవారు సైతం వెనక్కి వచ్చి మరీ తాయిలాలు అందుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసే తాయిలాలను రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
పక్కా ప్రణాళికతో: అధిక సంఖ్యలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రధాన పార్టీలు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నాయి. ఇంటింటి ప్రచారంలోనే ఒక్కో ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్య, అలాగే వారి ఫోన్ నంబర్లు సేకరించాయి. ఒక్కొక్క కార్యకర్తకు 100 మంది ఓటర్ల బాధ్యతలు అప్పగించాయి. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి మండల, గ్రామస్థాయి నాయకులకు డబ్బులు చేరినట్లు తెలుస్తోంది. కుల, యువజన సంఘాల నాయకులనూ కొందరు అభ్యర్థులు మచ్చిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ పార్టీలు నిజామాబాద్ జిల్లాలో కుల సంఘాలకు తాయిలాలు అందిస్తున్నాయి. సంఘాల్లోని సభ్యుల సంఖ్య ఆధారంగా తాయిలాలు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓ నియోజకవర్గంలో ఓటర్లకు చీరలు, కుక్కర్లు పంచారు. అలాగే తిన్నంత మాంసం ఇవ్వడంతో పాటు తాగినంత మద్యం కూడా పోయిస్తున్నారు.
ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం