భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం ప్రాథమిక జాబితాను రూపొందించింది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన సంఘం దృష్టికి కీలక సమస్యలు వచ్చాయి. వాటిలో 46 సమస్యలకు ధరణి పోర్టల్‌లో సరైన మాడ్యూళ్లు లేవని గుర్తించారు. భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగించాలంటే పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్‌లు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు.
మాడ్యూళ్లు...
ప్రస్తుతం ధరణిలో 31 సేవలు, 10 సమాచార మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. భూసమస్యలపై విజ్ఞప్తులకు కూడా ఒక మాడ్యూల్‌్ ఉన్నా. అది దరఖాస్తులను స్వీకరించడానికే పరిమితమవుతోంది. ఈ సమస్యపైనా దృష్టిసారించిన ఉపసంఘం.. రైతులెవ్వరూ ఇబ్బందులు పడకుండా సాంకేతికంగా మార్పులు చేయాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇకపై ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా పోర్టల్‌లో ఏర్పాట్లు ఉండేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, ఇందుకు కసరత్తు చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. మంత్రి వర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక అందించిన తరువాత ధరణిలో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు.
సమస్యల్లో కొన్ని
* ధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించి 8 రకాల సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డులకు సంబంధించినవి కూడా 8 ఉన్నాయి. మొత్తం 46 సమస్యలకు తప్పనిసరిగా ధరణిలో మాడ్యూళ్లు ఏర్పాటు చేయాలి. దీనికి అనుగుణంగా ఏం చర్యలు చేపట్టాలో ఉపసంఘం సూచనలను సిద్ధం చేసింది.
* మూల సర్వే నంబరు కన్నా తగ్గి లేదా ఎక్కువగా నమోదైన విస్తీర్ణం.. ఎసైన్డ్ భూమి పట్టాగా నమోదు కావడం, పట్టా భూమి ఎసైన్డ్‌గా నమోదు కావడం. భూమి సేకరించిన తీరు. కొన్నిచోట్ల పట్టాదారుల పేర్ల స్థానంలో ఇతరుల పేరు నమోదు. తప్పిపోయిన సర్వే నంబర్లు, కొన్ని విస్తీర్ణాలు ఖాతా నంబరు 99999లో నమోదైనవి.
* ఇనాం భూములకు ఓఆర్సీ పత్రాలు జారీ చేసి హక్కులు కల్పించడం. కొత్త పట్టాదారులకు ఖాతాల ఏర్పాటు. తప్పిపోయిన సర్వే నంబరు తిరిగి నమోదు.
* నిషేధిత జాబితాలో నమోదైన భూముల తొలగింపు.
* ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికెట్(ఈసీ) పరిశీలనకు అవకాశం. ధరణి ద్వారా ఈసీ, మార్కెట్ విలువ నిర్ధారణ ధ్రువపత్రాలు పొందేందుకు ఏర్పాటు.
* మూల సర్వే నంబరు ఆధారంగా భూయజమాని ఎవరనేది పరిశీలించుకునే అవకాశం.
* సిటిజన్ లాగిన్‌లో తప్పుగా నమోదైన భూ విస్తీర్ణాన్ని సరిచేసుకోవడం.
* ధరణి రిజిస్టర్ డాక్యుమెంట్ పొందడం.
* ప్రాపర్టీ నిర్వహణకు పవర్ ఆఫ్ అటార్నీ, లీజు బదిలీ, లీజు రద్దు, విక్రయ ధ్రువీకరణ పత్రం, కన్వేయన్స్ డీడ్, ఎక్స్ఛేంజి డీడ్
* ఒక సర్వే నంబరులోని సగం భూమికి వారసత్వ బదిలీ అవకాశం.
* ఆర్డీవోలు ప్రొసీడింగ్ చేసిన నాలా భూముల మార్పిడి.
* రెండు ఖాతాలు నమోదు కాగా రద్దు చేసి ఒక్క ఖాతాగా మార్చాలి.
* పెండింగ్ మ్యుటేషన్లకు పెట్టుకున్న దరఖాస్తులు గడువు తీరిపోయాయి. తిరిగి అవకాశం.
* ఆధార్ అనుసంధాన సమస్యలు.
* వ్యవసాయ భూమి నాలా కింద నమోదు కావడం, నాలా మార్పిడి అయిన భూమి వ్యవసాయ భూమిగా చూపుతుండటం.
* కొన్ని సర్వే నంబర్లు పోర్టల్‌లో కనిపించకుండా పోవడం. కోర్టు తీర్పు లేదా డిక్రీ ప్రకారం సర్వే నంబరులోని సగం భూమికి హక్కులు మార్చడం.
* ఖాతాలు తప్పిపోయినవి, లేదా నమోదు కానివి.
* నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూమి నమోదు.
* ఒక సర్వే నంబరులో కొంత భూమిని విక్రయించిన తరువాత ధరణిలో ఆ భూమి స్కెచ్ ఉండటం లేదు.
ఇదీ చూడండి: Dharani Portal Modules: ధరణిలోని సమస్యల పరిష్కారానికి మరిన్ని మాడ్యుల్స్