సీఎం కేసీఆర్ దృష్టికి
ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మహిళా కార్మికులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారేచోట ఛేంజ్ ఓవర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ.. అవి కేవలం డ్రెస్ ఛేంజ్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మలమూత్రాల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం ఆదేశంతో గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంచినీటి సౌకర్యాలు, శౌచాలయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
పది వరకు సంచార శౌచాలయాలు
శౌచాలయాల కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఆయా ప్రాంతాల్లో సంచార శౌచాలయాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 37 వరకు ఛేంజ్ ఓవర్ పాయింట్లు ఉన్నాయి. అందులో డిపో దగ్గర ఉన్నవాటిని వదిలేయగా మరో పది వరకు సంచార శౌచాలయాలు అవసరమవుతాయని అధికారుల అంచనా. ఆర్టీసీకి మియాపూర్లో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల్లో మార్పులు చేర్పులు చేసి సంచార శౌచాలయాలుగా మార్చాలని నిర్ణయించారు.
అన్నిరకాల వసతులు
ఆయా బస్సుల్లో మహిళా, పురుష ఉద్యోగులకు వేర్వేరుగా బయో టాయిలెట్స్ ఏర్పాటుచేశారు. వాటిలోనే డ్రెస్ ఛేంజ్, మంచినీటి సౌకర్యం, ఆహారం తినేవిధంగా అన్నిరకాల వసతులు కల్పించే విధంగా ఓ నమూనా సంచార శౌచాలయాన్ని తీర్చిదిద్దారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు, గురుద్వారా, చిలుకలగూడా, గండి మైసమ్మ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. సంచార శౌచాలయాలు అందుబాటులోకి వస్తే.. మహిళా ఉద్యోగులకు తిప్పలు తప్పినట్లే అని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'