MMTS services around Outer ring road: విశ్వనగరిగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డు ఓ మణిహారం. నగరంలోని ఏ మూలకు వెళ్లాలన్నా.. ఔటర్ రింగు రోడ్డు మీదుగా నిమిషాల వ్యవధిలో వెళ్లిపోతున్నారు. దూర ప్రాంతాలకు కూడా ఎటువైపు ఉన్నవారు అటు ఓఆర్‌ఆర్‌కు చేరుకుని సాగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మెట్రో రైలు వచ్చి నగర ప్రజారవాణా స్వరూపాన్నే మార్చేసింది. దీనికి ఎంఎంటీఎస్ రెండో దశ తోడైతే నగర శివార్ల నుంచి అతి తక్కువ ధరతో కాలుష్యం లేని ప్రయాణం ప్రజల సొంతం అవుతుంది. దీనికి తోడు.. ఔటర్ రింగు చుట్టూ అంటే 150 కిలోమీటర్ల మేర ప్రజా రవాణాను అందుబాటులోకి వస్తే.. ఇప్పుడు ఎంఎంటీఎస్ టిక్కెట్ ధరలను బట్టి కేవలం రూ.40లకే చుట్టూ ప్రయాణించొచ్చు.
రూ.1,500 కోట్లతో రైల్వే లైను: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఓఆర్‌ఆర్ చుట్టూ రైల్వే లైను నిర్మించాలని ప్రణాళికలు రచించింది. ఈ మేరకు రైల్వే లైన్లు నిర్మించేందుకు స్థలాన్ని సైతం కేటాయించింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక కిలోమీటరు రైల్వే లైను నిర్మాణానికి రూ.10 కోట్లు అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇలా రూ.1,500 కోట్లతో రైల్వే లైన్లు నిర్మాణం పూర్తవుతుంది. ఓఆర్‌ఆర్ చుట్టూ రెండో లైను కోసం మరో రూ.1,500 కోట్లు కేటాయించాలి. స్టేషన్లు, రైళ్లకు అదనంగా ఖర్చు చేయాలి.
ఇరువైపులా: ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, విల్లాలు, ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నివాసాలు బాగా పెరిగాయి. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఓఆర్‌ఆర్ చేరువకు చేరిపోతున్నారు. ఓఆర్‌ఆర్‌కు చేరువగా ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు కొన్ని ఉండగా, కొత్తగా కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఔటర్ రింగురోడ్డు చుట్టూ రైల్వే లైను నిర్మించి లోకల్ రైళ్లు పరుగులు పెడితే ఎంతోమందికి ప్రజారవాణా చేరువవుతుంది. పశ్చిమాన తెల్లాపూర్, తూర్పున ఘట్‌కేసర్, ఉత్తరాన మేడ్చల్, దక్షిణం వైపు ఉందానగర్ వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరించి ఉంది. ఇలా నలువైపుల నుంచి నగరంలోకి సులభంగా ఎంఎంటీఎస్ ద్వారా చేరుకోవచ్చు.
నలువైపులా స్టేషన్ల అభివృద్ధి: నగరంలోని మూడు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాలు అందుబాటులో లేక బయటే గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అందుకే విజయవాడ నుంచి వచ్చే రైళ్లను చర్లపల్లిలోనే ఆపేందుకు వీలుగా అక్కడ కొత్త రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇటు ముంబయి నుంచి వచ్చే రైళ్ల కోసం నాగులపల్లి దగ్గర స్టేషన్‌ను విస్తరించాల్సి ఉంది.
బెంగళూరు నుంచి వచ్చే రైళ్లను ఉందానగర్ దగ్గర, నాందేడ్ మార్గంలో వచ్చే రైళ్లను మేడ్చల్ దగ్గర ఆపేయాలనే ప్రతిపాదనలూ ఉన్నాయి. ఈ నాలుగు స్టేషన్ల నిర్మాణాలను హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది. దూర ప్రాంతాల రైళ్లు కూడా నగరంలోకి రాకుండా.. చర్లపలి, ఉందానగర్, మేడ్చల్, నాగులపల్లి రైల్వే స్టేషన్లలో నగర ప్రయాణికులను దించేసి అటునుంచి అటే వెళ్లిపోయే అవకాశం ఉంది.
- ఓఆర్‌ఆర్ నిడివి 150 కి.మీ.
- ఓఆర్‌ఆర్ దాటాక 10 కి.మీ. వరకూ నగర విస్తరణ
- నగరంలోకి రాకుండానే బైపాస్ ద్వారా దూర ప్రాంతాల రైళ్లు
- నగరం నలువైపులా తలపెట్టిన రైల్వే స్టేషన్లు 4
- రూ.1,500 కోట్లతో రైల్వే లైను
ఇవీ చదవండి: