సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి శాంతిభద్రతలు మరింత మెరుగయ్యాయని ఆయన అన్నారు. అయినప్పటికీ కొందరు దుర్మార్గులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
దిశ ఘటనలో గానీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గానీ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి ఒకట్రెండు ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. నిందితుడు రాజు తనకు తానే పశ్చాత్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పల్లా అన్నారు. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన పల్లా
రాష్ట్ర ప్రభుత్వం పాలనను మెచ్చి తనను ఎమ్మెల్సీగా పట్టభద్రులు గెలిపించారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ వి.భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. తనను గెలిపించిన పట్టభద్రులందరికి పల్లారాజేశ్వర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తనను అత్యధిక ఓట్లతో పట్టభద్రులు గెలిపించారన్నారు.
రాష్ట్రంలో క్రమేపి నేరాలు తగ్గుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో శాంతిభద్రతలు మెరుగయ్యాయి. ఒక ఘటన జరిగినప్పుడు ఒక రోజులోనే నిందితులను పట్టుకున్న మన పోలీసులకుంది. అయినప్పటికీ కొందరు దుర్మార్గులు దారుణాలకు పాల్పడుతున్నారు. దిశ ఘటన జరిగినప్పుడు కూడా ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడే పశ్చాత్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.- పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి: Saidabad Incident: అడ్డగూడురులోనే రాజు దొరికిండు... పోలీసులే చంపేశారు: రాజు తల్లి