MLC Kavitha went to Delhi : దిల్లీ మద్యం కేసు విచారణ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత నిన్న రాత్రి దిల్లీ వెళ్లారు. హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో... ఆమె దిల్లీకి చేరుకున్నారు. కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా హస్తినకు వెళ్లారు. దిల్లీ మద్యం కేసులో నేడు విచారణకు రావాలని.. కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీచేసింది. అయితే ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది.. తెలియాల్సి ఉంది.
ఈడీ విచారణకు హాజరుపై ఉత్కంఠ : మహిళలను ఈడీ విచారించడంపై కవిత దాఖలు చేసిన పిటిషన్.. ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈలోపే కవిత ఈడీ విచారణ ఉండడం వల్ల... ఆమె హాజరుపై సందిగ్ధత నెలకొంది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాజకీయ వర్గాల్లో కవిత ఈడీ విచారణ చర్చనీయాంశంగా మారింది.
సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ : విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనం... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు మొగ్గుచూపలేదు. అదే విధంగా ఈనెల 24న వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో ఈనెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
Kavita in Delhi Liquor Case: ఈనెల 11న దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 16న మరోసారి విచారణకు హాజరవ్వాలని అదే రోజున నోటీసులు జారీ చేశారు. అయితే తాను హాజరుకాలేనని ఈడీకి ఈ మెయిల్ ద్వారా కవిత లేఖను పంపారు. మరో రోజున విచారణకు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. ఆడియో, వీడియో విచారణకై సిద్ధమని ఎమ్మెల్సీ కవిత లేఖలో స్పష్టం చేశారు. తన నివాసానికి వచ్చి ఈడీ అధికారులు విచారణ చేయవచ్చన్నారు. తన ప్రతినిధిగా న్యాయవాది భరత్‌ను పంపుతున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇవీ చదవండి: