MLC Kavitha Latest News : తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని.. వారిని గుండెల్లో పెట్టుకుని గౌరవించుకుంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ పేద రాష్ట్రం కాదని.. స్వరాష్ట్ర సాధనతో సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం మారిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపడుతున్నా.. కొందరికి ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. అటువంటి వారు ఇకనైనా మారాలని సూచించారు. ప్రతి క్షణం, ప్రతి రోజు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. దుష్ప్రచారం చేసే వారు మన జ్యోతులు కాదని.. వారు ఏ జ్యోతులో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు అని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ భారత జాగృతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ సాహితీ సభల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను ఘనంగా సత్కరించారు. తెలంగాణ సాహిత్యంపై గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే సాహిత్య సభలు ఏర్పాటు చేయడం జరిగిందని కవిత అన్నారు.
పిల్లల్లో భాషపై, సాహిత్యంపై మక్కువ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. బాల సాహిత్యాన్ని ప్రచురణ చేసి స్కూల్, లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ చరిత్రను.. భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. బౌద్ధం, జైనం మీద పుస్తకాలు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరి గౌరీ శంకర్, దేశపతి శ్రీనివాస్, అనిశెట్టి రజిత, జితేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, పలువురు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. కళాకారులు పాడిన తెలంగాణ ఉద్యమ పాటలకు కవిత గొంతు కలిపి చప్పట్లు కొడుతూ పాట పాడారు. అనంతరం గన్ పార్క్ నుంచి మంగళ్‌హాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ ద్విచక్ర వాహనంపై.. అమరవీరుల స్మారకానికి భారీ ఊరేగింపుగా బయలుదేరారు.
"అమరవీరులను తలమీద పెట్టి పూజించుకునే గొప్ప సంస్కృతి మనది. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా కొందరు సమైక్యవాదులు విష ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. ప్రతి క్షణం, ప్రతి రోజు విషం చిమ్ముతున్నారు. దుష్ప్రచారం చేసే వారు మన జ్యోతులు కాదు.. వారు ఏ జ్యోతులో అందరికీ తెలుసు. రాష్ట్ర చరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు. ట్యాంక్ బండ్ సమీపంలో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించుకోబోతున్నాము. తెలంగాణ చరిత్రను.. భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తాం." - కవిత, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: