ఎమ్మెల్సీ కవిత తన పెద్ద మనసుతో దివ్యాంగులకు ఆపన్న హస్తం అందించారు. హైదరాబాద్‌లో ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలను అందించి చేయూతనిచ్చారు. వివిధ కారణాలతో దివ్యాంగులైన కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, మహబూబ్‌నగర్ నివాసితుడు నరేశ్, సుల్తానాబాద్‌కు చెందిన ఉమా మహేశ్‌లకు మూడు చక్రాల స్కూటీలను అందజేశారు.
ట్వీట్ చూసి..
కరీంనగర్ జిల్లా కుమ్మర్‌పల్లికి చెందిన శ్రీనివాస్ వెన్నెముక సమస్యతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా... ఆయన పరిస్థితిని తన స్నేహితుడు ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా శ్రీనివాస్ పరిస్థితి గురించి తెలుసుకున్న కవిత.. అతని కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ప్రమాదాల్లో పోగొట్టుకున్నారు..
సుల్తానాబాద్ మండలం కంఠినెపల్లి గ్రామానికి చెందిన ఉమా మహేశ్, మహబూబ్‌నగర్ జిల్లా మార్కెల్ గ్రామానికి చెందిన నరేశ్ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా దెబ్బతిని రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి వీల్ ఛైర్‌కే పరిమితం అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఉమా మహేశ్, నరేశ్‌ల దీనస్థితి గురించి తెలుసుకున్న ఆమె.. వారికి స్కూటీలు అందించి చేయూతనిచ్చారు.
అండగా ఉంటాం..
ఎలాంటి సమస్య వచ్చినా అధైర్య పడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించడంతో పాటు, అండగా ఉంటానన్న కవితకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: టీశాట్ ద్వారా 80 శాతం సిలబస్ పూర్తి చేశాం: సబితా ఇంద్రారెడ్డి