కరోనా మూడో దశ (Corona third wave) పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan reddy) ధ్వజమెత్తారు. కరోనాతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. పేద ప్రజల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జీవన్ రెడ్డి (Jeevan reddy)... టిమ్స్, ఈఎన్‌టీ, చెస్ట్ ఆసుపత్రులలో సిటీ స్కాన్ వసతి కూడా లేదన్నారు. జిల్లా ఆసుపత్రుల్లో కూడా సరైన వసతులు లేవని విమర్శించారు. ఆసుపత్రులలో ఇప్పటివరకు వైద్య సిబ్బందిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని నియామకాలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ మార్గదర్శకాలను విడుదల చేయాలని, కరోనాతో చనిపోయిన వారికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.