రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానాలకు ఎన్నిక కోసం రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు.
గడువు పూర్తైంది
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గానికి నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయా కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంటుంది. ఎన్నిక కోసం ఓటరు నమోదు గడువు పూర్తైంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీకి పదిరోజుల ముందు వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
ఓట్లు పెరిగే అవకాశం
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఐదు లక్షలా 21వేలకుపైగా, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో నాలుగు లక్షలా 92 వేలకుపైగా ఓటర్లు ఇప్పటికే జాబితాలో ఉన్నారు. చివరిదశలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తే మరికొన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తైంది.
ఉపఎన్నిక కోసం త్వరలో
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు కూడా త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతోపాటే సాగర్ ఎన్నిక కూడా ఉంటుందని అంటున్నారు. తిరుపతి స్థానానికి మార్చి 16 లోపు ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. తిరుపతితోపాటే నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం త్వరలోనే షెడ్యూల్ వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ ఈవీఎం ఫస్ట్ లెవల్ చెకింగ్ తదితర ఎన్నికల కసరత్తు కొనసాగుతోంది.
ఇదీ చూడండి : మేడారం చిన జాతరకు ముందే తరలివస్తున్న భక్తులు