MLC Anantha Babu Released From Jail: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబుకు రాజమహేంద్రవరంలోని ఫ్యామిలీ కోర్టు బెయిల్‌కు షరతులు విధించింది. అనంతబాబుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ, పాస్‌పోర్ట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లకూడదని,.. సాక్షుల్ని బెదిరించకూడదని,.. ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదని స్పష్టం చేసింది. ప్రతీ వాయిదాకు కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం షరతు విధించినట్లు ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు.
జైలు నుంచి విడుదల: ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి ఎట్టకేలకు విడుదలయ్యారు. 211 రోజులుగా సెంట్రల్ జైల్లో ఆయన ఖైదీగా ఉన్నారు. మే 19న కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఇంటి నుంచి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసినట్లు అనంతబాబు ఆరోపణ ఎదుర్కొంటున్నారు.
మృతదేహాన్ని తెల్లవారుజామున తన కారులో తీసుకువచ్చి ఇంటివద్ద వదిలేసి వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అనంతబాబుకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ తిరస్కరించింది.
మే 23 నుంచి ఆయన సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనంతబాబుకు మూడు రోజుల కిందట దేశ అత్యన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రాజమహేంద్రవరంలోని ఫ్యామిలీ కోర్టు షరతులు విధించింది. 50 వేల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచికత్తు, పాస్ పోర్టు కోర్టుకు సమర్పించడంతో పాటు దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది.
సాక్షుల్ని బెదిరించవద్దని, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో అనంతబాబు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. కారాగారం వద్దకు భారీగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు, అనుచరులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
ఇవీ చదవండి: