MLA Ticket Disputes in Telangana Main Parties : ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పుడు ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. టిక్కెన్ దక్కని నేతలు, పార్టీలో చాలా కాలంగా ఉన్నా ప్రాధాన్యం, పదవులు లభించని వారు అభ్యర్థులకు సహకరించడం లేదు. కొందరు నేతలు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటే మరికొందరు అభ్యర్థులతో ప్రచారంలో పాల్గొనకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇలా అసమ్మతి ఉన్న నేతలను దారికి తెచ్చుకోవడంపై ఇప్పుడు అభ్యర్థులు దృష్టి పెట్టారు. బుజ్జగింపులతో కొందరు నేతలు అలక వీడి సంబంధిత అభ్యర్థులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
MLA Ticket Disputes in BRS : రెండు నెలల కిందటే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. కిందిస్థాయి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయా అభ్యర్థులు ఇప్పుడు ఈ నేతల మీదే దృష్టి సారించారు. హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో బల్దియా కార్పొరేటర్లకు.. ఎమ్మెల్యేలకు మధ్య కొంత అంతరం ఉంది. దీన్ని చక్కదిద్దకపోతే తమకు నష్టం జరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో సంబంధింత కార్పొరేటర్లతో.. స్థానిక నాయకులతో అభ్యర్థులు మాట్లాడుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో కొంతమంది కార్పొరేటర్లకు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. కాగా వీరందరితో దానం ఇప్పటికే మాట్లాడారు.
కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఆమె భర్త గోవర్దన్‌రెడ్డితో రెండు మూడుసార్లు మాట్లాడారు. వారి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల బరిలో మొదటిసారి దిగారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి నుంచి తోడ్పాడు లభించడం లేదు.. ఇది లక్ష్మారెడ్డికి మైనస్‌గా మారింది. సుభాష్‌రెడ్డి పార్టీ మారేందుకు ప్రయత్నించి చివర్లో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు పార్టీలో స్తబ్దుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడి.. ప్రచారంలో పాల్గొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు. శేరింగపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటికే అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లతో బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ మంతనాలు జరిపినట్లు తెలిసింది. చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడి పార్టీ వారికి ప్రాధాన్యమిస్తామంటూ హామీలు ఇస్తున్నారు.
Ticket Clashes in Telangana Congress : రెండో జాబితా తెచ్చిన తంటా.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
హస్తం పార్టీలోనూ అసమ్మతి నేతల బెడద ఉంది. శేరింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన కొందరు నేతలు జగదీశ్వర్ గౌడ్‌కు సహకరించడం లేదు. అసంతృప్త నేతల ఇంటికి వెళ్లి ఆయన మాట్లాడుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి కూకట్పల్లి టికెట్ తెచ్చుకున్న మరో నేత బండి రమేశ్ కూడా ప్రచారాన్ని పక్కన అసంతృప్త నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆయాస్థానాల్లో అసంతృప్తులను టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుజ్జగిస్తున్నారు.