Jaggareddy Fires on Revanth Reddy: మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలుపుకొని పోయే పద్ధతి లేదా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ మెదక్ పర్యటనకు ఆయన వెళ్తున్నప్పుడు తనను ఆహ్వానించలేదని.. అందుకే కోపం వచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా.. పార్టీ బాధ్యతల నుంచి సోమవారం జగ్గారెడ్డిని ఏఐసీసీ తప్పించింది. ఇటీవల రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన జగ్గారెడ్డి.. ఇవాళ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా తప్పించడంపై స్పందించడంతో పాటు పీసీసీ అధ్యక్షుడి తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. కానీ తనను నిర్లక్ష్యం చేయడమే నచ్చలేదని వివరణ ఇచ్చారు.
అందుకే కోపం వచ్చింది
"రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆయనకు మెదక్ పర్యటనకు వెళ్తున్నప్పుడు నన్ను ఆహ్వానించలేదు. మెదక్‌కు వెళ్తున్నట్లు చెప్పారు గానీ నన్ను రమ్మని అడగలేదు. నన్ను పిలవకపోవడంతో కోపం వచ్చింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా.? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలుపుకునిపోయే పద్ధతి లేదా.?" -జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ వల్లే మేలు
కాంగ్రెస్ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోనియాగాంధీ కుటుంబం వల్లే కాంగ్రెస్ గొప్ప స్థాయికి చేరిందన్నారు. రాజీవ్‌గాంధీని చంపిన వారికి క్షమాభిక్ష సూచించిన గొప్ప కుటుంబం సోనియాగాంధీ అని కొనియాడారు. కానీ కాంగ్రెస్‌లోని కొందరు సోషల్ మీడియా ద్వారా తన పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీపై అభిమానంతోనే ఎప్పట్నుంచో ఇదే పార్టీలో ఉన్నానని వెల్లడించారు.
తెలంగాణ ద్రోహిగా పేరు మోశా
నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌తో తనకు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఏపీ విభజన వద్దని నిజం మాట్లాడి తెలంగాణ ద్రోహిగా పేరు మోశానన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజల ఆగ్రహం చూడాల్సిన రోజుల్లోనూ ధైర్యంగా మాట్లాడినట్లు గుర్తు చేశారు. ఏ ఆలోచన లేని శ్రీధర్‌బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Conflicts in Telangana Congress : కాంగ్రెస్‌లో కాక.. ఈసారి దిల్లీ చేరిన విభేదాలు