గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇవాళ పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జంట నగరాల్లో మరో ఐదు లింకు రోడ్లు ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రూ. 27.43 కోట్లతో నిర్మించిన ఐదు లింక్ రోడ్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. వసంత్ సిటీ నుంచి న్యాక్ 0.75 కిలోమీటర్లు, ఐడీపీఎస్ ఎంప్లాయిస్ కాలనీ నుంచి శ్రీల పార్కు ప్రైడ్ రోడ్ 0.46 కిలోమీటర్లు, నోవాటెల్ నుంచి ఆర్టీఏ ఆఫీస్ 0.6 కిలోమీటర్లు, జీవీ హిల్స్ పార్కు నుంచి మద్జీబ్ బండ 1.01 కిలోమీటర్లు, ఐఎస్బీ రోడ్డు నుంచి ఓఆర్ఆర్ 1.94 కిలోమీటర్లు రోడ్లను ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన రహదారులకు కనెక్టివిటీ పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి గాను మిస్సింగ్ లింక్ రోడ్లను హెచ్ఎండీఏ చేపట్టింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ వత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా నగర వ్యాప్తంగా స్లిప్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించి అనుసంధానం చేస్తోంది. నగరంలో 126.20 కిలోమీటర్ల విస్తీర్ణంలో 135 లింక్ రోడ్లను నిర్మించాలని హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. మొదటి దశలో భాగంగా 37 మిస్సింగ్ రోడ్లను రూ. 313 .65 కోట్లతో చేపట్టేందుకు పరిపాలన సంబంధిత అనుమతులు ప్రభుత్వం జారీచేసింది.
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
హైదరాబాద్ జంట నగరాల్లో రెండు పడక గదుల ఇళ్ల పేదలకు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. సనత్నగర్ నియోజకవర్గంలోని పొట్టిశ్రీరాములు నగర్ కాలనీలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. 14 కోట్ల రూపాయలతో 162 ఇళ్లను ఈ కాలనీలో నిర్మించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డిలు పాల్గొననున్నారు. వీటితో పాటు నిర్మాణం పూర్తయిన మరికొన్ని ఇళ్లను వచ్చే నెల మొదటి వారంలో పేదలకు అందివ్వనున్నారు.
ఇదీ చదవండి: INTER RESULTS: నేడే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు