A[ MINISTERS FIRES ON PAWAN : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ అన్నదమ్ములను ప్రజలు తిరస్కరించారని రోజా విమర్శించారు. వారాహి వాహనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్న రోజా.. సినీ నటుడుగా పవన్‌కల్యాణ్‌ను ప్రజలు అభిమానిస్తారు కానీ.. రాజకీయంగా ఆదరించరని హితవు పలికారు. గత ఎన్నికల్లో పవన్, తన సోదరుడు సొంత జిల్లాల్లో పోటీ చేసి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న పవన్ మాట తప్పారని ఆక్షేపించారు. నా మాట శాసనం అన్న పవన్.. శాసనసభ గేటును తాకలేకపోయారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు పార్ట్ టైం రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టాలని సవాల్ విసిరారు.
"2019లో జగన్ గెలవడు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం కాదు కదా శాసనసభ గేటు కూడా దాటలేదు. జగన్ సీఎం అయితే సన్యాసం తీసుకుంటారని పవన్ అన్నాడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. పార్టీ పెట్టిన నువ్వు రెండు సార్లు చిత్తుగా ఓడిపోయావు. మిమ్మల్నే కాదు మీ బ్రదర్స్‌ని కూడా ప్రజలు ఓడించారంటే ప్రజలకు మీపై నమ్మకం ఎంత ఉందో మీరే ఆలోచించండి. పవన్ వారాహితో వచ్చి గంగలో దూకుతారో, సముద్రంలో దూకుతారో మీ ఇష్టం. మా పార్టీ నాయకులపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలే దేహశుద్ధి చేస్తారు. పవన్ ఎప్పుడైనా రెండు కాళ్ల మీద నిలబడ్డాడా"-మంత్రి రోజా
పవన్, చంద్రబాబు ఏకమైనా జగన్‌ని ఓడించలేరన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం జగన్ పుట్టిన రోజున స్వప్న అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ దత్తతండ్రిని ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు కానీ.. తాను ముఖ్యమంత్రిని అవుతానని పవన్ చెప్పలేదన్నారు. వారాహి యాత్రలు చేసినా... ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా జగన్‌ను ఓడించలేరన్నారు. పవన్‌ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: