రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలన్న ధ్యేయంతో ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో పండించే పంటలను పరిగణలోకి తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా పరిశ్రమలశాఖ ఆహారశుద్ధి విధాన ముసాయిదాను రూపొందించింది. ముసాయిదాను మంత్రులందరికీ వివరించి వారి సలహాలు, సూచనలు స్వీకరించింది.
ద్విముఖ వ్యూహంతో...
రాష్ట్రంలో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా పెరుగుతున్న వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రాసెస్ చేసేలా పరిశ్రమలను ప్రోత్సహించాలని పేర్కొంది. స్థానికంగా నెలకొల్పే చిన్న యూనిట్లు మొదలు భారీ కంపెనీల కలబోతగా ఉండాలని, ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని ప్రతిపాదించింది. ఇతర పరిశ్రమల విషయానికి వస్తే రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తున్నారు. అయితే ఆహారశుద్ధి పరిశ్రమలకు సంబంధించి వంద కోట్ల పెట్టుబడి దాటితే మెగా ప్రాజెక్టులుగా భావించి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని భావిస్తున్నారు.
అవకాశాలతో పాటు కల్తీలేని ఆహారం అందిచటం...
ఆహారశుద్ధి పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఉంది. దాంతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలతో పాటు రైతు ఉత్పత్తి సంఘాలకు వీలైనంత ఎక్కువగా భాగస్వామ్యం కల్పించాలని ప్రతిపాదించారు. తద్వారా ఎక్కువ పెట్టుబడి వ్యయం లేకుండా తక్కువ ఖర్చుతో స్థానిక మహిళలకు ఉపాధి లభించడమే కాకుండా ఆహారపదార్థాలను సైతం అందించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్థాలను స్థానికంగా ఏర్పాటు చేసే చిన్న చిన్న యూనిట్ల ద్వారా అందించడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది.
మార్కెటింగ్‌పైనా దృష్టి...
ఆహారశుద్ధిని ప్రోత్సహించి ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు వాటి మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలు, గురుకులాలు సహా క్యాంటీన్లు తదితర అవసరాలకు చిన్న యూనిట్ల ద్వారా సరుకులను సరఫరా చేయడం లాంటి వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. ముసాయిదాను పరిశీలించిన మంత్రులు... మారుతున్న పంటల సరళి దృష్ట్యా ఆహార శుద్ధి కంపెనీలను ప్రోత్సహించాలని... పౌల్ట్రీ, మాంస ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. తెలంగాణ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేలా చూడాలని, ఆహార కల్తీని అరికట్టి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని అన్నారు.
మంత్రుల సూచనలు, సలహాలను పొందుపరిచాక ఆహారశుద్ధి విధాన ముసాయిదాను రానున్న మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకెళ్లాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది.