రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన యువతను ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ రాంకోఠిలోని రూబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గోషామహల్ నియోజకవర్గంలో పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు లభిస్తాయని తెలిపారు. అంతర్గత గొడవలను పక్కనపెట్టి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
అంతకుముందు తనను వేదికపైకి పిలవలేదని తెరాస సీనియర్ నేత, ఉద్యమకారుడు ఆర్.వి.మహేందర్‌కుమార్ నిలదీయడం వల్ల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరికి మంత్రులు నచ్చజెప్పడం వల్ల శాంతించారు. అనంతరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం'