రైతుల నిరసనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. బాధ్యత గల పదవిలో ఉండి.. రైతులను బ్రోకర్లుగా అభివర్ణించడం ఆయన అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేసి మాట్లాడటం హేయనీయమని.. ఎంపీ మాటల్లో రైతుల పట్ల కేంద్రంలో భాజపా వైఖరి స్పష్టమవుతోందని తెలిపారు.
గోస పెడుతోంది..
ఈ సందర్భంగా రైతులను కార్పొరేట్ కంపెనీల బానిసలుగా చేయాలని చూస్తోన్న భాజపా ఆటలు సాగమని మంత్రి పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు దిల్లీ సరిహద్దుల్లో న్యాయ పోరాటానికి దిగితే.. కేంద్ర బలగాలతో అన్నదాతలపై దాడి చేయించి కేంద్ర ప్రభుత్వం వారిని గోస పెడుతుందని తెలిపారు.
పతనానికి ప్రారంభం..
పసుపు బోర్డు పేరుతో గెలిచి రైతులను నయవంచన చేసిన ఎంపీ అర్వింద్‌కు.. రైతులు బ్రోకర్లుగానే కనిపిస్తారని మంత్రి దుయ్యబట్టారు. రైతులపై ఎంపీ అహంకారపు వ్యాఖ్యలు ఆయన పతనానికి ప్రారంభం అన్నారు.