అధిక ధరలకు మాంసం విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో మాంసం, చేపల సరఫరాపై విస్తృతంగా చర్చించారు. జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పశు, మత్స్య, పోలీస్, రవాణాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
గొర్రెలు, మేకల సరఫరా ఆగిపోవడం వల్ల మటన్ ధరలు పెరిగాయని తలసాని అన్నారు. కోళ్లు, గుడ్ల సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇస్తుందని వెల్లడించారు. గొర్రెలు, మేకలను జంట నగరాలకు తీసుకొచ్చి విక్రయించుకోవచ్చవన్నారు. అనుమతుల కోసం కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షకు ఎంపీలు రంజిత్‌రెడ్డి, బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శి అనితారాజేంద్రన్, మత్స్యశాఖ కార్యదర్శి సువర్ణ, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: అన్నదాతకు అండగా ఉంటాం.. ప్రతి గింజనూ కొంటాం