ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తూ ప్రోత్సహిస్తోందని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు ఈ ఏడాది రూ. 10 కోట్ల 40 లక్షల ఖర్చుతో 47 రిజర్వాయర్లు, 45 చెరువుల్లో 5 కోట్ల రొయ్య పిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు.
'రాష్ట్రంలో మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా 2016-17 నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలనే ఆలోచనతో 2017-18 సంవత్సరం నుంచి ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు విడుదల చేయడం ద్వారా మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.'
తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి
ఏ సంవత్సరంలో ఎంత ఖర్చు
- 2017-18 సంవత్సరంలో రూ. 1.38 లక్షల ఖర్చుతో 11 రిజర్వాయర్లలలో కోటి 8 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
- 2018-19 సంవత్సరంలో రూ. 6.27 కోట్ల వ్యయంతో 24 రిజర్వాయర్లలో 3.19 కోట్ల రొయ్య పిల్లలు విడుదల
- 2019-20 సంవత్సరంలో రూ. 6.39 కోట్ల ఖర్చుతో 70 రిజర్వాయర్లలో 3.42 కోట్ల రొయ్య పిల్లలు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు.
- మూడేళ్లలో రూ. 14 కోట్లు ఖర్చు చేసి 7.69 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయగా రూ. 51 కోట్ల 50 లక్షల విలువైన రొయ్యల ఉత్పత్తి జరిగిందని చెప్పుకొచ్చారు.
- 2016-17 సంవత్సరంలో 1.98 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి ఉండగా ఉచితంగా రొయ్య పిల్లలు పంపిణీ వల్ల 2019-20 సంవత్సరంలో ఆ ఉత్పత్తి 3.10 లక్షల టన్నులకు పెరిగిందని స్పష్టం చేశారు.
ఫలితంగా సుమారు 30 వేల మత్స్యకారుల కుటుంబాల ఆదాయం కూడా గడిచిన 3 ఏళ్లలో రెట్టింపైందని, ఇది ఎంతో సంతోషదాయకం అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మరిన్ని చోట్లకు పతంగి.. గెలిచే అభ్యర్థులవైపే మొగ్గు!