పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసం ఉత్పత్తే లక్ష్యంగా చెంగిచెర్ల ఆధునిక పశువధశాలలో చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. వధశాల పరిధిలోని గొర్రెలు, మేకల విక్రయదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్ పశుభవన్‌లోని తన కార్యాలయంలో బోడుప్పల్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ నేతృత్వంలో అధికార ప్రతినిధి బృందంతో చర్చించారు.
క్షేత్రస్థాయిలో గొర్రెలు, మేకల విక్రయదారులు సమస్యల మంత్రికి వినతిపత్రం సమర్పించారు. పశువధశాల ప్రాంగణలో షెడ్ల నిర్మాణం, త్రాగు నీటి సరఫరా, శౌచాలయాల నిర్మాణం సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రాంగణంలో నిరంతరం పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి, టీఎస్ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ రాంచందర్, న్యాయ సలహాదారు శేఖర్ యాదవ్, మొండెదారుల సంఘం అధ్యక్షులు నవీన్ యాదవ్, జాల నరసింహ యాదవ్ పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేసి.. వర్షాకాలంలో గ్రేటర్ వాసులు ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌లు, జలమండలి అధికారులతో వర్షాకాల సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా పనులు మందగించాయన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున వేగవంతం చేయాలన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గుర్తించి సమగ్ర నివేదికను అందజేయాలని మంత్రి ఆదేశించారు. బీకే గూడ పార్క్ సమీపంలో శిథిలావస్థకు చేరిన జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి నాలుగున్నర కోట్లు మంజూరయ్యాయని.. నిర్మాణ నమూనాను సిద్దం చేయాలని సూచించారు. సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్న మంత్రి తలసాని.. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను అందజేయాలని ఆదేశించారు.