ఈనెల 25, 26 తేదీల్లో జరిగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు(BONALU) ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. భక్తుల కోసం సిద్ధం చేసిన సౌకర్యాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(MINISTER TALASANI SRINIVAS YADAV) పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల జాతరను విజయవంతం చేస్తామని అన్నారు.
నేడు ఒడిబియ్యం
అమ్మవారి జాతర విషయంలో రాజకీయాలకు తావులేదని... అందరికీ సమాన గౌరవం ఇస్తామని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 3 గంటలకు తమ కుటుంబం తరఫున తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించిన అనంతరం... జాతర మొదలు కానున్నట్లు మంత్రి తెలిపారు. నేడు శుక్రవారాన్ని పురస్కరించుకొని ఒడిబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించామని... భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా పెద్ద ఎత్తున హాజరయ్యారని వెల్లడించారు.
మీడియా పాయింట్‌పై మంత్రి ఆరా
మీడియా పాయింట్ ఎందుకు మార్చారని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఏటా ఏర్పాటు చేసే విధంగా... అదే స్థానంలో మీడియా పాయింట్ ఉండేలా పోలీసులు చూడాలన్నారు. విద్యుత్, జలమండలి, జీహెచ్‌ఎంసి అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి చెప్పారు.
అమ్మవారికి ప్రత్యేక చీర
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా ఎల్లుండి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర ప్రారంభం కానుంది. ఏటా అమ్మవారికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టుచీర సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు 25న జరగబోయే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించనున్న చీరను శాస్త్రోక్తంగా తయారు చేశారు.
ఈసారి వైభవంగా బోనాలు
ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలు... కరోనా ప్రభావంతో గతేడాది నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ ఏడాది వైభవంగా బోనాల ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు ప్రత్యేక నిధులను కేటాయించింది.
రంగం స్పెషల్
ఆషాఢంలో బోనాల్ని సమర్పించడమంటే, అమ్మ కటాక్షంతో దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడం. ఈ సమయంలో జంటనగరాల్లో బోనాల సందడి అంతాఇంతా కాదు. పిల్లాపెద్దా అంతా కలిసి ఆనందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి జాతరతో ఈ సంబురం అంబరాన్నంటుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. రంగంలో భవిష్యవాణి వినిపిస్తారు. రాష్ట్రంలోని పరిస్థితులు, రాబోయే రోజులను గురించి చెప్తారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారు.
ఇదీ చదవండి: Ujjaini Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పట్టుచీర తయారీ ప్రారంభం