రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరుల్లో ఈ నెల 16న చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టాలని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతోన్న వివిధ కార్యక్రమాలపై అన్ని జిల్లాల అధికారులతో సచివాలయంలో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నందున అన్ని జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి... 24 వేల నీటి వనరుల్లో దాదాపు 80 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. నిబంధనల మేరకు చేప పిల్లలను విడుదల చేయడాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్య శాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
5 కోట్ల రొయ్య పిల్లల విడుదలకు టెండర్ల ఆహ్వానం
గత రెండేళ్లలో చేపట్టిన రొయ్య పిల్లల పెంపకం సత్ఫలితాలు ఇవ్వడం వల్ల ఈసారి వివిధ నీటి వనరుల్లో 5 కోట్ల రొయ్య పిల్లలు విడుదల చేసేందుకు టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి తలసాని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అదనపు నీటి వనరులు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా... ఒక కోటి చేప విత్తనం, 26 లక్షల రొయ్య విత్తనం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మత్స్య శాఖ అధికారుల ఝార్ఖండ్ సందర్శన అనంతరం ఖమ్మం జిల్లాలోని వైరా, పాలేరు, నల్గొండ జిల్లా శాలిగౌరారం, మెదక్ జిల్లా పోచారం, సిద్దిపేట జిల్లా శనిగరం రిజర్వాయర్లలో పెన్ కల్చర్ ద్వారా మొదటి దశలో చేప పిల్లల పెంపకం చేపట్టినట్లు మంత్రి వివరించారు.
ఇదీ చూడండి : వేగంగా సచివాలయం తరలింపు ప్రక్రియ