Minister Talasani on Double Bedroom Allotment : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం తరహా ఇళ్లను.. దేశంలో మరెక్కడైనా నిర్మిస్తున్నారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని.. పశుసంవర్థక శాఖమంత్రి తలసాని(Talasani) శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వందశాతం ఉచితంగా సకల సౌకర్యాలతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి.. అత్యంత పారదర్శకంగా అర్హులకు పంపిణీ చేస్తున్నామన్నారు.
Double Bedroom Houses In Hyderabad : నేడు మూడు, నాలుగో విడత 'డబుల్' ఇండ్ల లాటరీ
Double Bedroom Online Draw : హైదరాబాద్ లక్డికాపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాయలంలో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను ఆన్‌లైన్ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి అందించామని.. మూడో విడతలో 36,884 మంది లబ్దిదారులకు అందించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా ముందుకు కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఇల్లు రానివారు బాధపడవద్దని.. వారి కోసం మరో 30 వేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Talasani Latest News : రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని పేర్కొన్నారు. లక్ష ఇల్లు నిర్మించి పంపిణీ చేస్తామంటే ఎవరు నమ్మలేదు.. ఇప్పుడు ఇల్లు వచ్చినవాళ్లు ప్రభుత్వాన్ని దైవ సమానంగా చూస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. ఆన్‌లైన్ డ్రాలో ఇల్లు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ఎంపికైన వారికి గాంధీ జయంతి అక్టోబర్ 2 తేదీ, అక్టోబర్ 5 తేదీ పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు. దేశ చరిత్రలో వందశాతం సబ్సిడీతో ఇళ్లు కట్టిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమన్నారు.
నగరంలో 8,60,000 వేల రూపాయలతో.. ఒక్కో ఇల్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇవన్నీ చాలా ఖరీదైన భూములని.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ పెద్ద మొత్తంలో ఉంటుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం 9600 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు.. అరికెపూడి గాంధీ, కాలేరు వెంకటేశ్, సుభాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
"దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నాము. వీటిని అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్ డ్రా ద్వారా.. అర్హులకు పంపిణీ చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కల.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఇళ్లను నిర్మించి పంపిణీ చేస్తాము". - తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి